IND vs AUS: కౌర్ సేనకు అగ్ని పరీక్ష: నేడు ఆస్ట్రేలియాతో భారత్ కీలక పోరు

విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో నేడు (అక్టోబర్ 13) భారత్ అత్యంత కీలక మ్యాచ్ కు సిద్ధమవుతుంది. సెమీస్ కు రేస్ లో ముందుకెళ్లాలంటే పటిష్టమైన ఆస్ట్రేలియాపై గెలిచి తీరాల్సిందే. భారత్ ప్రస్తుతం మూడు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నేడు ఆసీస్ తో గెలిస్తే  6 పాయింట్లతో సెమీస్ కు మరింత చేరువవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోయినా సెమీస్ ఆశలు సజీవంగానే ఉంటాయి. అప్పుడు న్యూజిలాండ్ తమ చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఓడిపోవాలి.

ప్రస్తుతం టోర్నీలో న్యూజిలాండ్  3 మ్యాచ్ ల్లో 2 గెలిచి నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కివీస్ జోరును చూస్తుంటే పాక్ గెలవడం కష్టంగానే కనిపిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలిచి దాదాపు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. నెట్ రన్ రేట్ కూడా ఎక్కువగా ఉండడంతో నేడు భారత్ తో జరిగే మ్యాచ్ లో భారీ తేడాతో ఓడిపోకుండా ఉంటే సెమీస్ కు చేరుతుంది. న్యూజి లాండ్ కంటే టీమిండియాకు రన్ రేట్ ఎక్కువ ఉండడంతో ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ఈ మ్యాచ్ లో ఆసీస్ స్టార్ ప్లేయర్లు కెప్టెన్ అలిస్సా హీలీ, ఫాస్ట్ బౌలర్ టేలా వ్లెమింక్‌ గాయాల కారణంగా ఈ మ్యాచ్ లో ఆడడం లేదు. హీలే గాయపడడంతో ఆమె స్థానంలో మూనీ కెప్టెన్సీ చేసే అవకాశముంది. దీంతో ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించి సెమీస్ కు వెళ్లేందుకు చక్కని అవకాశం కుదిరింది. షార్జా వేదిక  జరగనున్న ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.