BGT 2024-25: భారత్‌కు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాకు బయలుదేరుతున్న రోహిత్

ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 భారత జట్టుకు అత్యంత కీలకం కానుంది. న్యూజిలాండ్‌పై భారత్ 3-0తో వైట్‌వాష్ అయిన తర్వాత భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాల్సిన పరిస్థితి. రోహిత్ సేన టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే, ఆస్ట్రేలియా ప‌ర్యట‌న‌ చావో రేవో లాంటిది. బోర్డర్ గ‌వాస్కర్ ట్రోఫీని 5-0 లేదా 4-0 తేడాతో సిరీస్ ద‌క్కించుకుంటే, తప్ప ముందుకెళ్లే దారుల్లేవ్. ఈ సిరీస్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం కానున్నట్టు వార్తలు వచ్చాయి. 
 
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం కానున్నట్టు వార్తలు వచ్చాయి. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ను 0-3 తేడాతో కోల్పోయిన తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాతో పెర్త్ లో జరగనున్న తొలి టెస్ట్  విషయంపై సందేహం వ్యక్తం చేశాడు. వ్యక్తిగత సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు నివేదికలు చెప్పుకొచ్చాయి. దీంతో తొలి టెస్టుకు రోహిత్ దూరమవ్వడం ఖాయమనుకున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచార ప్రకారం కీలకమైన ఆసీస్ సిరీస్ కోసం టీమిండియా తొలి బ్యాచ్‌తో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు టాక్ నడుస్తుంది. 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు మొత్తం రెండు బ్యాచ్‌లుగా ఆస్ట్రేలియా ప్రయాణిస్తుంది. మొదటి బృందం నవంబర్ 10న బయలుదేరుతుంది. రెండవ బృందం నవంబర్ 11న వెళ్లాల్సి ఉంటుంది. వాణిజ్య కారణాల వల్ల బీసీసీఐ మొత్తం జట్టును ఒకే వాణిజ్య విమానంలో బుక్ చేయలేకపోయింది. అధికార ప్రకటన రాకపోయినా భారత్ తొలి బ్యాచ్‌తో రోహిత్ ఆస్ట్రేలియా సిరీస్‌కు వెళ్లడం దాదాపుగా ఖాయమైంది. దీంతో భారత అభిమానులు ఖుషీ అవుతున్నారు. రోహిత్ జట్టులో ఉంటే కెప్టెన్సీ పాటు ఓపెనర్ గా భారత్ కు ఎలాంటి సమస్య ఉండదు. 

ALSO READ : AUS vs IND: ప్రాక్టీస్ మ్యాచ్‌లు దండగ: వరుసగా రెండో టెస్టులోనూ ఆసీస్‌పై భారత్ ఓటమి

ఆస్ట్రేలియాకు రోహిత్ వెళ్లినా తొలి టెస్టు ఆడతాడో లేదో అనే విషయంపై స్పష్టత రాలేదు. అతని భార్య రితికా సజ్దే తమ రెండవ బిడ్డకు జన్మనిస్తున్నట్టు తొలి టెస్ట్ సమయానికి ఆమె డెలివరీ అయితే రోహిత్ ఈ టెస్టుకు దూరం కానున్నాడని నివేదికలు చెబుతున్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్ గా భారత్ ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది.

ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్  72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం.