న్యూఢిల్లీ: మనదేశంలోని భారీ జనాభాను ఉపయోగించుకొని తయారీని, ఉత్పత్తిని పెంచితే రాబోయే పదేళ్లలో ఇండియా 11 శాతం గ్రోత్ రేట్ సాధించడం సాధ్యమవుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర శనివారం అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాల్లో భాగంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘‘మనదేశానికి సవాళ్లూ, అవకాశాలూ.. రెండూ ఉన్నాయి. సవాళ్లను దాటి, అవకాశాలను దక్కించుకోవాలి. ఇలా చేయగలిగితే అద్భుత ఫలితాలు మన సొంతమవుతాయి. 11 శాతం గ్రోత్ రేట్ అసాధ్యం ఏమీ కాదు. ఇదే జరిగితే 2048 నాటికి కాదు... 2031 నాటికే మనదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎకానమీ అవుతుంది. భారత్ జనాభా 138 కోట్లు. అత్యధిక యువత ఉన్న దేశం కూడా మనదే! వచ్చే ఏడాది నాటికే జనాభా విషయంలో మనం చైనాను మించిపోతాం”అని ఆయన వివరించారు. పనిచేయగల జనాభా నిష్పత్తిలోనూ మనదేశం మొదటిస్థానంలో ఉంది. ఈ విషయంలో చైనా, బ్రెజిల్, అమెరికా భారత్ కంటే వెనకబడి ఉన్నాయి. దేశంలో 2045 వరకు పనిచేసే జనాభా నిష్పత్తి పెరుగుతుంది.
మానుఫ్యాక్చరింగ్ ముఖ్యం
ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ గురించి మాట్లాడుతూ మన ఎకానమీ గ్రోత్‌ను పెంచడానికి ఇది అద్భుతమైన ఇంజన్ అని కామెంట్ చేశారు. దీనిని భారీగా పెంచితే ఎగుమతులు విపరీతంగా పెరుగుతాయని, సంప్రదాయ ఆలోచనలను పక్కనబెట్టి ఈ రంగంలో సత్తా చాటుతున్న ఇతర దేశాలను అనుసరించాలని పాత్ర పిలుపునిచ్చారు. ‘‘ఈ టార్గెట్‌ను సాధించాలంటే మనం మూడు పనులు చేయాలి. తయారీ రంగం ఆటోమేషన్ ద్వారా నాలుగో పారిశ్రామిక విప్లవానికి అనుగుణంగా మారాలి. డేటా ఎక్సేంజ్, సైబర్- ఫిజికల్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కాగ్నిటివ్ కంప్యూటింగ్, స్మార్ట్ ఫ్యాక్టరీ, అడ్వాన్స్డ్ రోబోటిక్స్ ద్వారా ఇది జరగాలి. హ్యూమన్ కాపిటల్ (మానవ మూలధనం)లో పెట్టుబడులను పెంచడం రెండవది. తద్వారా నైపుణ్యం కలిగిన వర్కింగ్ఫోర్స్ను అభివృద్ధి చేయాలి. మూడవది అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించడానికి కష్టపడాలి. గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారడానికి భారతదేశం తయారీ రంగం వాటాను జిడిపిలో కనీసం 25 శాతానికి పెంచాలి. ఎగుమతులను భారీగా పెంచుకోవడానికి, ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించడానికి ఇది ఒక మార్గం’’ అని పాత్ర చెప్పారు. ప్రస్తుతం 800 బిలియన్ డాలర్ల విలువైన వస్తు,సేవల ఎగుమతులతో ఇండియాకు గ్లోబల్‌గా మొత్తం 2.7 శాతం వాటా ఉంది. 2030 నాటికి ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్న ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని భారత్ సాధించగలిగితే, మనం ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశ వాటాను 5 శాతానికి పెంచుకోగలమని ఆయన అన్నారు. దీంతో భారత్ ఎగుమతి శక్తిగా మారుతుందని ఆయన అన్నారు. ఈ టార్గెట్‌ను సాధించడానికి అనేక కార్యక్రమాలు అమలు అవుతున్నాయని డిప్యూటీ గవర్నర్ పేర్కొన్నారు. "అంతర్జాతీయీకరణ" (గ్లోబలైజేషన్) చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ‘‘భారతీయ డయాస్పోరా (విదేశాల్లోని మనవాళ్లు) ప్రపంచంలోనే అతిపెద్దది. రెమిటెన్స్‌ల విషయంలో భారతదేశం మొదటిస్థానంలో ఉంది. మన రూపాయితో విదేశాలలోనూ భారీగా బిజినెస్ జరుగుతోంది. భారత రూపాయి టర్నోవర్ గ్లోబల్ ఫారెక్స్ టర్నోవర్‌లో పెరిగితే, మన కరెన్సీకి అంతర్జాతీయ కరెన్సీగా గుర్తింపు వచ్చినట్లవుతుంది. ఇలా అంతర్జాతీయ కరెన్సీగా మారే సత్తా మన రూపాయికి ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం స్థానాన్ని చాటి చెబుతుంది”అని మైఖేల్ పాత్ర అన్నారు.
