ఇండియా వైట్​వాష్​ .. చిత్తయ్యారు.. సొంతగడ్డపై తొలిసారి 0 – 3తో వైట్‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌

  • మూడో టెస్టులో 25 రన్స్ తేడాతో న్యూజిలాండ్ గెలుపు
  • 147 టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజ్ చేయలేక రోహిత్‌‌‌‌‌‌‌‌సేన ఓటమి
  • రిషబ్ పంత్ పోరాటం వృథా

అదే కథ. టీమిండియా ఆట మారలేదు. వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఎదురుదెబ్బలు తగిలినా రోహిత్‌‌‌‌‌‌‌‌సేన పాఠాలు నేర్వలేదు. ఇప్పటికే సిరీస్ కోల్పోయినా.. బ్యాటర్లు బాధ్యతగా ఆడలేదు. రెండో రోజు స్పిన్నర్లు జట్టును రేసులోకి తెచ్చినా..  రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్ గొప్పగా పోరాడినా.. 147 పరుగుల చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ కూడా ఛేజ్ చేయలేకపోయింది. ఫలితంగా సొంతగడ్డపై 0-3తో కివీస్‌‌‌‌‌‌‌‌ చేతిలో వైట్‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌కు గురైన ఇండియా తలదించుకుంది. స్వదేశంలో వరుసగా 18 సిరీస్‌‌‌‌‌‌‌‌ విజయాల తర్వాత ఒక్కసారిగా నేలకు దిగింది. ఈ ఓటమితో వరల్డ్ టెస్టు చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్ పాయింట్ల పట్టికలో ఇండియా టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌ గల్లంతైంది. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టుల్లో నాలుగు నెగ్గకుంటే రోహిత్‌‌‌‌‌‌‌‌సేన నేరుగా  ఫైనల్ చేరడంకూడా  కష్టమే కానుంది. మొత్తంగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి... కేన్ విలియమ్సన్ లేకుండానే ఆడిన బ్లాక్‌‌‌‌‌‌‌‌క్యాప్స్ జట్టు  ఇండియా మైండ్‌‌‌‌‌‌‌‌బ్లాంక్‌‌‌‌‌‌‌‌ చేసింది. తమ టెస్టు క్రికెట్ చరిత్రలో  నిలిచిపోయే ఘనత సాధించింది.

ముంబై: స్వదేశంలో టీమిండియా అత్యంత అవమానకర పరాజయం చవి చూసింది. 1933 నుంచి స్వదేశంలో టెస్టులు ఆడుతున్న ఇండియా జట్టు మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి అన్నింటిలోనూ ఓడింది. బెంగళూరు, పుణెలో గెలుపు జోరును కొనసాగించిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ వాంఖడేలోనూ రోహిత్‌‌‌‌‌‌‌‌సేన నడ్డి విరిచింది. మూడు రోజు ఆదివారం ముగిసిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 25 రన్స్ తేడాతో ఇండియాను ఓడించిన కివీస్‌‌‌‌‌‌‌‌ 3–0తో సిరీస్‌‌‌‌‌‌‌‌ను క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. ఆ జట్టు ఇచ్చిన 147 రన్స్ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌సేన 29.1 ఓవర్లలో 121 స్కోరుకే ఆలౌటైంది. రిషబ్ పంత్ (57 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 64) ఫిఫ్టీతో మెరిసినా.. మిగతా వాళ్లంతా ఫెయిలయ్యారు. ఎజాజ్ (6/57) ఆరు, ఫిలిప్స్  (3/42) మూడు వికెట్లతో దెబ్బకొట్టారు. అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నైట్ స్కోరు 171/9తో ఆట కొనసాగించిన కివీస్ మరో మూడు రన్స్ జోడించి రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 174 వద్ద ఆలౌటైంది. ఎజాజ్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌, విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌‌‌‌‌‌‌‌ అవార్డులు దక్కాయి.

పంత్ పోరాడినా

టార్గెట్ చిన్నదే అయినా.. వికెట్‌‌‌‌‌‌‌‌ స్పిన్‌‌‌‌‌‌‌‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో  ఓపిగ్గా.. ఆచితూచి ఆడాల్సిన ఇండియా అనవసరంగా వికెట్లు కోల్పోయి చేజేతులా ఓడిపోయింది.  డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో ప్రతికూల నిర్ణయాలూ ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాయి. మూడో రోజు ఆట మొదలైన వెంటనే మిగిలిన వికెట్‌‌‌‌‌‌‌‌ తీసి కివీస్‌‌‌‌‌‌‌‌ను ఆలౌట్ చేసి టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇండియాకు వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. వరుసగా రెండు ఫోర్లతో ఊపు మీద కనిపించిన కెప్టెన్ రోహిత్ (11) హెన్రీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో పుట్‌‌‌‌‌‌‌‌షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌కు చిక్కడంతో జట్టు పతనం మొదలైంది. 

తర్వాతి ఓవర్లో ఎజాజ్ వేసిన టర్నింగ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను గిల్ (1) ఆడకుండా వదిలేయగా అది నేరుగా వికెట్లను తాకింది. ఎజాజ్ తర్వాతి ఓవర్లోనే ఫార్వర్డ్ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ ఆడిన విరాట్ కోహ్లీ (1) స్లిప్‌‌‌‌‌‌‌‌లో డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో 18/3తో ఇండియా కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన రిషబ్ పంత్ తన మూడో బాల్‌‌‌‌‌‌‌‌నే సిక్స్‌‌‌‌‌‌‌‌గా మలిచి ఎదురుదాడికి దిగాడు. కానీ, మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో వికెట్ల పతనం ఆగలేదు. ఫిలిప్స్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో యశస్వి జైస్వాల్ (5) వికెట్ల ముందు దొరికిపోగా.. ఎజాజ్ వేసిన ఫుల్‌‌‌‌‌‌‌‌టాస్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను సర్ఫరాజ్ (1) డీప్ మిడ్ వికెట్‌‌‌‌‌‌‌‌లో రచిన్ చేతుల్లోకి కొట్టడంతో 29 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఇండియా సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రవీంద్ర జడేజా (6)  క్రీజులో నిలిచే ప్రయత్నం చేయగా.. మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో పంత్‌‌‌‌‌‌‌‌ తన మార్కు వెరైటీ షాట్లతో వరుసగా బౌండ్రీలు కొట్టసాగాడు. ఎజాజ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో షార్ట్‌‌‌‌‌‌‌‌లెగ్‌‌‌‌‌‌‌‌లో యంగ్‌‌‌‌‌‌‌‌ పట్టిన చురుకైన క్యాచ్‌‌‌‌‌‌‌‌కు జడేజా ఔటైనా.. సుందర్ (12) తోడుగా పంత్ జోరు కొనసాగించాడు. ఎజాజ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనే వరుసగా రెండు ఫోర్లతో 47 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఇండియా 92/6తో లంచ్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది. 

బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే ఎజాజ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మరో రెండు ఫోర్లు కొట్టిన రిషబ్ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. కానీ, తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌కే  థర్డ్ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివాదాస్పద నిర్ణయంతో తను ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌గా పెవిలియన్ చేరాడు. అప్పటికి ఇండియా స్కోరు 106/7.  ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అశ్విన్ (8) ఒక్కో పరుగు జత చేస్తూ స్కోరు 120కి చేర్చారు. మరో 27 రన్స్ మాత్రమే అవసరం అవ్వడంతో ఇండియా ఆశలు కోల్పోలేదు. కానీ, 29వ ఓవర్లో వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో అశ్విన్‌‌‌‌‌‌‌‌, అకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్ (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ కివీస్ గెలుపు ఖాయం చేశాడు. తర్వాతి ఓవర్లోనే సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఎజాజ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్ ముగించాడు. 

పంత్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌పై వివాదం

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పంత్ ఔట్‌‌‌‌‌‌‌‌పై వివాదం రేగింది. ఎజాజ్ బాల్‌‌‌‌‌‌‌‌ను పంత్ క్రీజు ముందుకొచ్చి డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ చేయబోగా అది గాల్లోకి లేచింది. దాన్ని అందుకున్న కివీస్ క్యాచ్ ఔట్ కోసం అప్పీల్ చేయగా..  బాల్‌‌‌‌‌‌‌‌ ప్యాడ్‌‌‌‌‌‌‌‌కు తగిలిందని ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. లాథమ్‌‌‌‌‌‌‌‌ డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ కోరగా.. బంతి బ్యాట్‌‌‌‌‌‌‌‌కు దగ్గరగా వెళ్తున్న సమయంలో పంత్ బ్యాట్‌‌‌‌‌‌‌‌ అతని ప్యాడ్స్‌‌‌‌‌‌‌‌కి తగిలినట్టు  అల్ట్రాఎడ్జ్‌‌‌‌‌‌‌‌లో కనిపించింది. కానీ, థర్డ్ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ ముందుగా బ్యాట్‌‌‌‌‌‌‌‌కు తగిలిందని చెబుతూ ఔట్ ఇచ్చాడు. దీనిపై పంత్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్ అంపైర్లతో వాదనకు దిగాడు. తీవ్ర అసహనంతో గ్రౌండ్ వీడాడు.

టాప్ గల్లంతు

ఈ ఓటమితో వరల్డ్  టెస్టు చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌  ఇండియా తన టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియా  62.50 పాయింట్స్ పర్సెంటేజీతో టాప్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చింది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌‌‌‌‌‌‌‌లో మొత్తంగా ఐదో ఓటమితో ఇండియా పీసీటీ  62.82 నుంచి 58.33కి తగ్గి  రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌కు పడిపోయింది.  శ్రీలంక (55.56), న్యూజిలాండ్ (54.55), సౌతాఫ్రికా (54.17)  3, 4, 5వ స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదు టెస్టులు ఆడనున్న ఇండియా అందులో నాలుగింటిలో గెలిస్తేనే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఓటమికి నాదే బాధ్యత: రోహిత్‌‌‌‌ శర్మ

ఇలాంటి ఓటమిని ఎదుర్కొన్న  తర్వాత నా కెరీర్‌‌‌‌‌‌‌‌ అత్యల్ప దశకు చేరినట్టు అనిపిస్తోంది. ఈ పరాజయానికి నేనే పూర్తి బాధ్యత వహిస్తా. దీన్నిజీర్ణించుకోవడం చాలా కష్టం.  మేం  మా బెస్ట్  క్రికెట్‌‌‌‌ను ఆడలేదు. సిరీస్ మొత్తం న్యూజిలాండ్ బాగా ఆడింది. మేం చాలా తప్పిదాలు చేశాం. మొదటి రెండు టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌‌‌‌ల్లో మంచి స్కోర్లు చేయలేకపోయాం. ఈ మ్యాచ్‌‌‌‌లో తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో ఆధిక్యం సాధించాం. 

ఈ టార్గెట్‌‌‌‌ కూడా ఛేజ్‌‌‌‌ చేసేదే అయినా మేం పూర్తిగా ఫెయిలయ్యాం. సిరీస్‌‌‌‌లో నేను కెప్టెన్‌‌‌‌గా, బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా బాగా ఆడలేకపోయాను. ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌లో తొలి టెస్టులో ఆడతానో లేనో చెప్పలేను. ఆ సమయంలో నాకు వ్యక్తిగత పనులు ఉన్నాయి. 

స్వదేశంలో మూడు అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఇండియా వైట్‌‌‌‌‌‌‌‌వాష్ అవ్వడం ఇదే తొలిసారి. టీమిండియా ఇది వరకు 2000లో  సౌతాఫ్రికా చేతిలో 0-2తో, 1980లో ఇంగ్లండ్ చేతిలో 0-1తో వైట్ వాష్ అయింది.  1983 తర్వాత సొంతగడ్డపై ఒక సిరీస్‌‌‌‌‌‌‌‌లో మూడు టెస్టులు ఓడటం ఇదే తొలిసారి.

ఒక టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌  మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లూ గెలవడం ఇదే మొదటిసారి. ఇండియాలో కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా రోహిత్‌‌‌‌‌‌‌‌కు ఇది ఐదో టెస్టు ఓటమి. పటౌడీ (9) తర్వాత స్వదేశంలో ఎక్కువ ఓటములు ఎదుర్కొన్న కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.

వాంఖడే స్టేడియంలో ఆడిన రెండు టెస్టులో ఎజాజ్ పటేల్‌‌‌‌‌‌‌‌ తీసిన వికెట్లు. ఇండియాలో ఒక గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ ఆటగాడిగా ఇయాన్ బోథమ్ (22) రికార్డు బ్రేక్ చేశాడు. 

సంక్షిప్త స్కోర్లు
 

న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 235 ఆలౌట్‌‌‌‌‌‌‌‌. ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌:   263 ఆలౌట్‌‌‌‌‌‌‌‌; న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 45.5 ఓవర్లలో 174 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ 51, జడేజా 5/55); ఇండియా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్‌‌‌‌‌‌‌‌ 147): 29.1 ఓవర్లలో (పంత్ 64, సుందర్ 12, ఎజాజ్ 6/57, ఫిలిప్స్ 3/42).