అదే జోరు.. అదే తీరు.. ఎక్కడా తగ్గలేదు.. ఎక్కడా పట్టు వదల్లేదు..! ఫార్మాట్ ఏదైనా.. అపోజిషన్ ఓ మ్యాచ్ గెలిచినా… చివరాఖరకు సిరీస్ మాత్రం టీమిండియాదే..! ఎదురుగా కొండంత లక్ష్యం ఉన్నా.. భయపెట్టే బౌలర్లు బరిలో ఉన్నా.. కింగ్ కోహ్లీ (81 బంతుల్లో 9 ఫోర్లతో 85) వీరోచిత పెర్ఫామెన్స్‌కు తోడు.. హిట్‌మ్యాన్ రోహిత్ (63 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 63), రాహుల్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 77) మరోసారి హిట్టవ్వడంతో.. మూడో వన్డేలోనూ విరాట్‌సేన గ్రాండ్ విక్టరీ సాధించింది..! దీంతో 2–1తో సిరీస్‌ను గెలిచిన ఇండియా.. కరీబియన్లపై వరుసగా పదో ద్వైపాక్షిక సిరీస్‌ను కైవసం చేసుకుంది..!!
కటక్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా.. ఘన విజయంతో ఈ ఏడాదికి వీడ్కోలు పలికింది. టార్గెట్ ఛేజింగ్‌లో టాప్ ఆర్డర్ చెలరేగడంతో.. ఆదివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 315 రన్స్ చేసింది. పూరన్ (64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89), పొలార్డ్ (51 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 74), హోప్ (50 బంతుల్లో 5 ఫోర్లతో 42) చెలరేగారు. తర్వాత ఇండియా 48.4 ఓవర్లలో 6 వికెట్లకు 316 రన్స్ చేసింది. చివర్లో జడేజా (39 నాటౌట్) ఆకట్టుకున్నాడు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
ముగ్గురూ.. ముగ్గురే
టార్గెట్ పెద్దదిగా ఉన్నా.. ఓపెనర్ రోహిత్ తనదైన శైలిలో అటాకింగ్ మొదలుపెట్టాడు. హోల్డర్ బౌలింగ్‌లో సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చిన హిట్‌మ్యాన్.. రన్‌రేట్ ఆరుకు తగ్గకుండా చూశాడు. రెండోఎండ్‌లో రాహుల్ సింగిల్స్‌తో మంచి సమన్వయాన్ని అందించడంతో తొలి 10 ఓవర్లలో ఇండియా 59/0 స్కోరు చేసింది. 16వ ఓవర్‌లో ఇండియా వంద రన్స్‌కు చేరుకోగా. కొద్దిసేపటికే రాహుల్ 53, రోహిత్ 52 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. ఈ జోడీని 22వ ఓవర్‌లో హోల్డర్ విడగొట్టాడు. మంచి స్వింగ్‌తో వచ్చిన బంతి రోహిత్ బ్యాట్‌ను ముద్దాడుతూ కీపర్ చేతిలోకి వెళ్లింది. దీంతో తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రాహుల్‌తో జతకలిసిన కోహ్లీ తెలివిగా బ్యాటింగ్ చేశాడు. జోసెఫ్ బౌలింగ్‌లో తొలి సిక్సర్ బాదిన రాహుల్ సెంచరీ చేస్తాడని ఆశించినా.. అతనికే వికెట్ ఇచ్చుకున్నాడు. ఫుల్ పేస్‌తో వచ్చిన బాల్‌ను లెగ్‌సైడ్ ఫ్లిక్ చేయబోయి కీపర్‌కు చిక్కాడు. రెండో వికెట్‌కు 45 రన్స్ సమకూరాయి. 16 బంతుల తేడాలో శ్రేయస్ అయ్యర్ (7) ఔట్‌కావడం, 14 బాల్స్ తర్వాత రిషబ్ పంత్ (7) క్లీన్‌బౌల్డ్ కావడంతో ఇండియా కొద్దిగా తడబడింది. అయినా స్కోరు 201/4కు చేరడం, కోహ్లీ క్రీజులో ఉండటంతో పెద్దగా ఇబ్బందిలేకపోయింది. అయితే ఆశలు పెట్టుకున్న కేదార్ జాదవ్ (9) మరోసారి నిరాశపర్చాడు. అయినా కోహ్లీ 51 బంతుల్లో 55వ ఫిఫ్టీ మార్క్‌ను చేరి టీమ్‌ను గెలుపు దిశగా సాగించాడు. క్రీజులోకి వచ్చిన జడేజా నిలకడ చూపడంతో 46 ఓవర్లలో ఇండియా 286/5 స్కోరు చేసింది. ఇక ఇండియా గెలవాలంటే 24 బంతుల్లో 30 రన్స్ కావాలి. ఈ దశలో పాల్ వేసిన ఆఫ్‌సైడ్ బాల్‌ను ఆడే క్రమంలో విరాట్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. స్టేడియం సైలెంట్ అయ్యింది. కానీ శార్దూల్ (17 నాటౌట్)రెండు ఫోర్లు, ఓ సిక్స్, జడేజా ఓ ఫోర్‌తో విజయాన్ని అందించారు.
సూపర్ బౌలింగ్..
విండీస్ ఓపెనర్లు లూయిస్ (21), హోప్ తొలి వికెట్‌కు 57 రన్స్ జత చేశారు. 15వ ఓవర్‌లో లూయిస్ ఔట్‌కావడంతో.. ఆశ్చర్యకరంగా ఛేజ్ (38) ఫించ్ హిట్టర్‌గా వచ్చాడు. రెండోఎండ్‌లో నిలకడగా బౌలింగ్ చేసిన షమీ (1/66)… 20వ ఓవర్‌లో హోప్‌ను ఔట్ చేసి ఒత్తిడి పెంచాడు. శార్దూల్ ప్లేస్‌లో బౌలింగ్‌కు దిగిన అరంగేట్రం కుర్రాడు నవ్‌దీప్ సైనీ (2/58) మంచి పేస్, బౌన్స్‌తో ఆకట్టుకున్నాడు. హెట్‌మయర్ (37)ను కట్టడి చేసి రన్స్ నిరోధించాడు. పేస్–స్పిన్ కాంబినేషన్ సమర్థంగా పని చేయడంతో విండీస్ స్కోరు నత్తనడకన సాగింది. 28వ ఓవర్‌లో (శార్దూల్) రెండో బంతిని హెట్‌మయర్ భారీ షాట్ కొట్టాడు. దాదాపుగా సిక్స్ అనుకున్న ఆ బాల్‌ను బౌండరీ లైన్ వద్ద రాహుల్ అద్భుతంగా అందుకున్నాడు. కానీ బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో బంతిని బౌండరీ లైన్ లోపలకు విసరలేకపోయాడు. 8 బంతుల తేడాలో హెట్‌మయర్, ఛేజ్‌ను ఔట్ చేసి.. సైనీ ఇండియాను రేసులోకి తీసుకొచ్చాడు.
ఆఖర్లో దంచారు..
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడటంతో తడబాటుకు లోనైన విండీస్‌ను పూరన్, పొలార్డ్ ఆదుకున్నారు. స్లాగ్ ఓవర్లలో ఇండియా బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. 40 ఓవర్లలో 197/4 ఉన్న విండీస్ స్కోరును 300లు దాటించారు. శార్దూల్ వేసిన 48వ ఓవర్‌లో పూరన్ ఔటైనా.. మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 21 రన్స్ వచ్చాయి. తర్వాతి ఓవర్ (సైనీ)లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 16, లాస్ట్ ఓవర్‌లో రెండు సిక్సర్లతో 16 రన్స్ వచ్చాయి. దీంతో చివరి 10 ఓవర్లలో 118 రన్స్ చేసింది.
22 ఏళ్ల రికార్డు బద్దలు
హిట్‌మ్యాన్ రోహిత్ మరో రికార్డు బద్దలుకొట్టాడు. ఓపెనర్‌గా ఒక క్యాలెండర్ ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. 2019లో ఈ ముంబైకర్ 47 ఇన్నింగ్స్‌ల్లో 53.08 యావరేజ్‌తో 2442 రన్స్ చేశాడు. దీంతో 1997లో లంక లెజెండ్ ప్లేయర్ సనత్ జయసూర్య 2387 రన్స్ (44 ఇన్నింగ్స్)తో నెలకొల్పిన రికార్డును దాటేశాడు. 2008లో సెహ్వాగ్ 2355 (46 ఇన్నింగ్స్) రన్స్ చేశాడు. ఈ ఏడాది రోహిత్ 10 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లోనూ 1490 రన్స్‌తో రోహిత్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఈ దశాబ్దంలో వన్డేల పరంగా రోహిత్‌దే బెస్ట్ యావరేజ్ 58.1. ఆమ్లా 50.1, వార్నర్ 47.7 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్ కూడా రోహితే (78).
మళ్లీ క్యాచ్‌లు మిస్
ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా ఫీల్డర్లు క్యాచ్‌లు మిస్ చేశారు. సైనీ వేసిన 9వ ఓవర్‌లో లూయిస్ బలంగా కొట్టిన బంతి పాయింట్‌లో జడేజాకు చిక్కినట్లే చిక్కి మిస్ అయ్యింది. అప్పటికి లూయిస్ స్కోరు 14 రన్స్. కష్టసాధ్యమైన ఈ క్యాచ్‌ను జడ్డూ సూపర్‌గా డైవ్ చేసి అందుకున్నా బంతిని బాగా ఒడిసిపట్టలేకపోయాడు. 25వ ఓవర్ (జడేజా)లో హెట్‌మయర్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ల వెనుక పంత్ జారవిడిచాడు. లెగ్ సైడ్ జంప్ చేసినా బంతిని అందుకోలేకపోయాడు. సైనీ బౌలింగ్ చేసిన 30వ ఓవర్‌లో హెట్‌మయర్ క్యాచ్‌ను ఫైన్ లెగ్‌లో కుల్దీప్ నేలపాలు చేశాడు. పరుగుల ఖాతా తెరవకుండానే ఛేజ్‌ను పెవిలియన్‌కు పంపే చాన్స్‌ను రిషబ్ వృథా చేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో అతను ఇచ్చిన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు.
