పొట్టి ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసి.. తొలి వన్డేలో ఓడినా.. వైజాగ్‌లో ఓ రేంజ్‌లో చెలరేగిన టీమిండియా ఆ జట్టుతో వన్డే సిరీస్‌కు, ఈ సీజన్‌కు అదిరిపోయే ముగింపు ఇవ్వాలనుకుంటోంది..! గత మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన జోష్‌లో ఉన్న కోహ్లీసేన చివరి వన్డేలోనూ విక్టరీ కొట్టి విండీస్‌పై వరుసగా పదో సిరీస్ కైవసం చేసుకునేందుకు రెడీ అయింది..! గాయం కారణంగా పేసర్ దీపక్ చహర్ సేవలు కోల్పోయినా సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది..! అదే టైమ్‌లో గత రెండు మ్యాచ్‌ల్లో ఫెయిలైన విరాట్ కోహ్లీ కూడా తన మార్కు ఆటతో ఈ సీజన్ ఫినిష్ చేయాలని భావిస్తున్నాడు..! ఇంకోవైపు చెన్నై మ్యాచ్ మాదిరిగా మరో సంచలనంపై వెస్టిండీస్ కన్నేసింది..! ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగి 13ఏళ్ల తర్వాత ఇండియాలో సిరీస్ నెగ్గాలని ఆరాటపడుతోంది..! కటక్‌లో ఇరు జట్ల మధ్య ఫైనల్‌లాంటి మూడో వన్డే నేడే..! మరి, సిరీస్ ఎవరిదో.. 2019కి ఫినిషింగ్ పంచ్ ఎవరు ఇస్తారో చూడాలి..!
కటక్:
పరుగుల మోత మోగుతున్న ఇండియా-, వెస్టిండీస్ వన్డే సిరీస్ తుది అంకానికి చేరింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడి బరాబతి స్టేడియంలో జరిగే లాస్ట్ ఫైట్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ 1–1తో సమంగా ఉండగా.. కటక్‌లో రెండు జట్లు సిరీస్‌పై కన్నేశాయి. ప్రస్తుత ఫామ్ రికార్డులు చూస్తే ఇండియానే ఫేవరెట్‌అయినప్పటికీ.. పవర్ హిట్టర్స్ ఉన్న విండీస్‌ను తక్కువ అంచనా వేయలేం. ఇండియాలో 13 ఏళ్లుగా తమకు అందని ద్రాక్షగా ఉన్న వన్డే సిరీస్‌ను ఈసారి సాధించాలని కరీబియన్లు కసిగా ఉన్నారు. కాగా, ఈ ఏడాది సొంతగడ్డపై ఆడిన చివరి, ఏకైక వన్డే సిరీస్‌లో ఇండియా 1–2తో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కానీ, గత 15 ఏళ్లలో మన జట్టు హోమ్‌గ్రౌండ్‌లో వరుసగా రెండు వన్డే సిరీస్‌లు ఓడిపోలేదు. ఆ రికార్డును కొనసాగించాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గాల్సిందే.
కోహ్లీ చెలరేగితే..
తొలి మ్యాచ్ నెగ్గిన వెస్టిండీస్ అందరినీ ఆశ్చర్య పరచినా.. ఆ పోరులో బయటపడ్డ బలహీనతలను ఇండియా వెంటనే సరిదిద్దుకుంది. వైజాగ్‌లో ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్ చేసి విజయం సాధించడంతో ఆటగాళ్లంతా ఖుషీగా ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్‌లో ఫెయిలైన ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ సెంచరీలతో ఫామ్‌లోకి రావడంతో పాటు నాలుగులో శ్రేయస్ అయ్యర్ కుదురుకోవడం, రిషబ్ పంత్ గాడిలో పడడంతో బ్యాటింగ్ మరింత దుర్భేధ్యంగా మారింది. విండీస్ అంటేనే ఊగిపోయే కోహ్లీ ఈ సిరీస్‌లో మంచి ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. టీ20ల్లో అదరగొట్టినా రెండు వన్డేల్లోనూ విఫలమవడం మాత్రం అతని ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది. చాలా అరుదుగా విఫలమయ్యే కోహ్లీ ఈ రెండు మ్యాచ్‌ల్లో కలిపి 5 బంతులే ఎదుర్కొని 4 రన్సే చేశాడు. ఈ ఏడాదికి ఇదే చివరి మ్యాచ్ కావడంతో కటక్‌లో చెలరేగాలని అతనితో పాటు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక, తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన ఇండియా బౌలింగ్.. రెండో వన్డేలో మెరుగైంది. మహ్మద్ షమీ మ్యాచ్ టర్నింగ్ వికెట్లతో రాణించగా కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ తో ఇండియా సిరీస్‌లో నిలిచింది. ఈ మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరిపై అంచనాలున్నాయి. అయితే, మరో స్ట్రయిక్ బౌలర్ దీపక్ చహర్ గాయంతో దూరమవడం జట్టుకు లోటే. అయితే, అతనికి రిప్లేస్‌మెంట్‌గా వచ్చిన నవదీప్ సైనీ కూడా టాలెంటెడ్ ప్లేయరే. ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో ఆడాలని కెప్టెన్ భావిస్తే అతని వన్డే అరంగేట్రం ఖాయమే. ఇద్దరు పేసర్లే కావాలనుకుంటే మాత్రం శార్దుల్‌తో అతను పోటీ పడాల్సి ఉంటుంది. కానీ, సెకండ్ వన్డేలో పేలవంగా ఆడిన శార్దుల్ కంటే రంజీ ట్రోఫీలో రాణించిన సైనీకే మొగ్గు కనిపిస్తోంది. అలాగే కుల్దీప్‌కు జతగా మరో రిస్ట్ స్పిన్నర్ చహల్‌కు అవకాశం దక్కొచ్చు. వీటన్నిటికంటే జట్టును వేధిస్తున్న అతిపెద్ద సమస్య క్యాచ్ డ్రాప్స్. దీంతోనే తొలి వన్డేల్లో మూల్యం చెల్లించుకున్న కోహ్లీసేన.. దీన్ని అధిగమించకుంటే సిరీస్ చేజారినట్టే.
విండీస్‌కు బ్యాటింగే బలం..
ఆల్‌రౌండర్లతో నిండిన విండీస్ బలం బ్యాటింగే. ధనాధన్ బ్యాటింగ్‌తో కొండంత లక్ష్యాన్నైనా ఇట్టే కరిగించే సామర్థ్యం ఆ జట్టు సొంతం. మైదానంతో సంబంధం లేకుండా ఆ జట్టు లాస్ట్ బ్యాట్స్‌మెన్ వరకు అలవోకగా సిక్సర్లు కొట్టేస్తారు. తొలి వన్డేలో షై హోప్, హెట్‌మయర్ రికార్డు ఇన్నింగ్స్… రెండో వన్డేలో హోప్, నికోలస్ పూరన్‌తో పాటు ఎనిమిదో నంబర్‌లో వచ్చిన కీమో పాల్ పోరాడిన తీరే ఇందుకు నిదర్శనం. ఓపెనర్ ఎవిన్ లూయిస్‌తో పాటు పొలార్డ్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. కరీబియన్ల దూకుడును ఆపాలంటే ఇండియా తెలివిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. భాగస్వామ్యాలను వెంటనే విడదీస్తేనే ఫలితం దక్కుతుంది. కాట్రెల్, పియర్, అల్జారీ జోసెఫ్‌తో విండీస్ బౌలింగ్ పటిష్టంగానే ఉంది. ఇక, ఈ టూర్‌లో తనదైన శైలిలో మెరిసిన కాట్రెల్, హెట్‌మయర్ ఐపీఎల్ వేలంలో పంట పండించుకున్నారు. భారీ ధరకు అమ్ముడుపోయి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నారు. వీరిని ఇండియా ఎలా అడ్డుకుంటుందో మరి.
