పాక్ను ఓడించి సెమీస్‌‌‌‌ రేసులో నిలిచిన ఇండియా

  • పాక్‌‌‌‌ పని పట్టేసి.. సెమీస్‌‌‌‌ రేసులో నిలిచిన ఇండియా
  • దాయాదిపై 6 వికెట్లతో గెలుపు
  • సత్తాచాటిన హైదరాబాదీ అరుంధతి
  • రాణించిన శ్రేయాంక, షెఫాలీ

దుబాయ్‌‌‌‌: టీ20 వరల్డ్ కప్‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌లో చిత్తయిన ఇండియా అమ్మాయిలు వెంటనే పుంజుకున్నారు.  సెమీఫైనల్‌‌‌‌ రేసులో నిలవాలంటే కీలకమైన పోరులో దాయాది పాకిస్తాన్‌పై పంజా విసిరారు.  హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి (3/19) సూపర్ బౌలింగ్‌‌‌‌తో ఆకట్టుకోవడంతో ఆదివారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌‌‌‌ను పడగొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడిన పాక్‌‌‌‌ సెమీస్ ఆశలు దాదాపు ఆవిరవయ్యాయి. తొలుత టీమిండియా బౌలింగ్ దెబ్బకు పాక్‌‌‌‌ నిర్ణీత 20 ఓవర్లలో 105/8 స్కోరు మాత్రమే చేసింది. నిదా దర్ (34 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌తో 28) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. అరుంధతితో పాటు శ్రేయాంక పాటిల్ (2/12) రెండు వికెట్లతో రాణించింది. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో ఇండియా  18.5 ఓవర్లలోనే 108/4 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మ (35 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లతో 32)తో పాటు కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ (24 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌తో 29 రిటైర్డ్ హర్ట్‌), జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌ (23) రాణించారు. అరుంధతికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం జరిగే తర్వాతి మ్యాచ్‌‌‌‌లో శ్రీలంకతో ఇండియా పోటీ పడనుంది.కాగా, గ్రూప్‌–బి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. 

కష్టంగానే

చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో ఇండియా కూడా కష్టపడింది. తొలుత షెపాలీ తర్వాత జెమీమా, కెప్టెన్ హర్మన్‌‌‌‌ నిలకడ చూపడంతో లక్ష్యాన్ని అందుకుంది. బౌలింగ్‌‌‌‌కు అనుకూలిస్తున్న వికెట్‌‌‌‌పై పాక్‌‌‌‌ బౌలర్లు వరుసగా ఏడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వలేదు. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (16 బాల్స్‌‌‌‌లో 7)ను ఐదో ఓవర్లో సాదియా ఇక్బాల్‌‌‌‌ పెవలియన్‌‌‌‌ చేర్చింది.  మరోవైపు షెఫాలీ జాగ్రత్త పడటంతో పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలో ఇండియా 25/1తో నిలిచింది. ఫీల్డింగ్ మారిన తర్వాత షెఫాలీ నెమ్మదిగా జోరు పెంచింది. టుబా హసన్‌‌‌‌ వేసిన ఎనిమిదో ఓవర్లో తొలి బౌండ్రీ రాబట్టింది. టుబా బౌలింగ్‌‌‌‌లోనే మరో ఫోర్‌‌‌‌‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌కు చలనం తీసుకురాగా.. సగం ఓవర్లకు ఇండియా 50/1తో నిలిచింది. వన్‌డౌన్‌ బ్యాటర్ జెమీమా స్ట్రయిక్ రొటేట్‌‌‌‌ చేసింది. ఒమైమా వేసిన 12వ ఓవర్లో మరో ఫోర్ కొట్టిన షెఫాలీ ఇంకో షాట్‌‌‌‌కు ట్రై చేసి ఔటైంది. ఈ దశలో జెమీమాకు తోడైన కెప్టెన్ హర్మన్‌‌‌‌ ఒక్కో పరుగు జత చేసింది. ఇద్దరూ క్రీజులో కుదురుకోగా.. 15 ఓవర్లకు  ఇండియా 79/2తో నిలిచింది. కానీ, తర్వాతి ఓవర్లోనే  వరుస బాల్స్‌‌‌‌లో జెమీమా, రిచా ఘోష్ (0)ను ఔట్‌‌‌‌ చేసిన ఫాతిమా సనా ఒక్కసారిగా పాక్‌‌‌‌ను రేసులోకి తెచ్చింది. చివరి నాలుగు ఓవర్లలో ఇండియాకు 22 రన్స్ అవసరం అయ్యాయి. కెప్టెన్ హర్మన్‌‌‌‌ ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. బౌండ్రీలు రావడం కష్టం కావడంతో  ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మ ( 7 నాటౌట్‌‌‌‌)తో కలిసి  వేగంగా సింగిల్స్‌‌‌‌, డబుల్స్‌‌‌‌తో టార్గెట్‌‌‌‌ను కరిగించింది.  ఫాతిమా వేసిన 18వ ఓవర్లో ఫోర్ రాబట్టిన ఆమె విజయానికి నాలుగు రన్స్ దూరంలో మెడ నొప్పి కారణంగా రిటైర్డ్‌‌‌‌ హర్ట్ అయింది. తర్వాతి బాల్‌‌‌‌కే సజన (4 నాటౌట్‌‌‌‌) విన్నింగ్ ఫోర్ కొట్టి మ్యాచ్‌‌‌‌ ముగించింది.

అరుంధతి, శ్రేయాంక అద్భుత బౌలింగ్‌‌‌‌

టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన పాకిస్తాన్‌‌‌‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు సక్సెస్‌‌‌‌ అయ్యారు.   ఇన్నింగ్స్ ఆరో బాల్‌‌‌‌కే ఓపెనర్‌‌‌‌‌‌‌‌ గుల్‌‌‌‌ ఫెరోజా (0)ను మంచి ఇన్‌‌‌‌స్వింగర్‌‌‌‌‌‌‌‌తో  క్లీన్‌‌‌‌బౌల్డ్‌‌‌‌ చేసిన పేసర్‌‌‌‌‌‌‌‌ రేణుకా సింగ్‌‌‌‌ ఇండియాకు అద్భుత ఆరంభం ఇచ్చింది. ఈ జోరును మిగతా బౌలర్లు కొనసాగించారు. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మ  స్లో, ఫ్లయిటెడ్‌‌‌‌ బాల్స్‌‌‌‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు పరీక్ష పెట్టింది. నిలకడగా ఆడుతున్న మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ మునీబాకు తోడైన వన్‌‌‌‌డౌన్ బ్యాటర్ సిద్రా అమిన్ (8) ఐదో ఓవర్లో  దీప్తి  బాల్‌‌‌‌ను స్వీప్‌‌‌‌ చేయబోయి బౌల్డ్  అవ్వడంతో  పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేను పాక్‌‌‌‌ 29/2తో ముగించింది. మంచి లైన్‌‌‌‌ అండ్ లెంగ్త్‌‌‌‌తో కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌ చేసిన అరుంధతి వేసిన ఓవర్లో మునీబా ర్యాంప్ స్కూప్‌‌‌‌ షాట్‌‌‌‌ ఆడి ఇచ్చిన సింపుల్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ను ఆశ శోభన డ్రాప్ చేసింది. కానీ, అదే ఓవర్లో  ఒమైమా సొహైల్ (3) ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను షెఫాలీ వర్మ అందుకుంది. ఈ దశలో స్పిన్నర్లు మరింత కట్టడి చేయడంతో పాక్ రన్‌‌‌‌రేట్‌‌‌‌ పడిపోయింది. శ్రేయాంక బౌలింగ్‌‌‌‌లో రిచా ఘోష్‌ స్టంపింగ్‌‌‌‌కు  మునీబా పెవిలియన్‌‌‌‌ చేరగా పది ఓవర్లకు పాక్‌‌‌‌ 41/4తో కష్టాల్లో పడింది. మళ్లీ బౌలింగ్‌‌‌‌కు వచ్చిన అరుంధతి 13వ ఓవర్‌‌‌‌‌‌‌‌ తొలి బాల్‌‌‌‌కే ఆలియా రియాజ్‌‌‌‌ (4)ను ఎల్బీ చేయడంతో 52/5తో పాక్‌‌‌‌ సగం వికెట్లు కోల్పోయింది. ఈ టైమ్‌‌‌‌లో ఆశ బౌలింగ్‌‌‌‌లో ఫాతిమా సనా (13) వరుసగా రెండు ఫోర్లు కొట్టినా.. తర్వాతి బాల్‌‌‌‌కే  కీపర్‌‌‌‌‌‌‌‌ రిచా పట్టిన చురుకైన క్యాచ్‌‌‌‌కు వెనుదిరిగింది. తర్వాతి ఓవర్లో టుబా హసన్ (0)ను శ్రేయాంక ఏడో వికెట్‌‌‌‌గా వెనక్కుపంపింది. స్లాగ్‌‌‌‌ ఓవర్లలో సయేదా అరూబ్‌‌‌‌ ( 14 నాటౌట్‌‌‌‌ )తో కలిసి పోరాడిన నిదా దర్‌‌‌‌  విలువైన రన్స్ అందించింది. ఆఖరి‌‌‌‌  ఓవర్లో ఆమెను అరుంధతి బౌల్డ్ చేయగా.. చివరి రెండు బాల్స్‌‌‌‌కు   నష్రా సంధు (6 నాటౌట్‌‌‌‌) 2, 4 రాబట్టడంతో స్కోరు వంద దాటింది. 

సంక్షిప్త స్కోర్లు

పాకిస్తాన్‌‌: 20 ఓవర్లలో 105/8 (నిదా దర్ 28, మునీబా అలీ 17, అరుంధతి రెడ్డి 3/19, శ్రేయాంక పాటిల్ 2/12)

ఇండియా: 18.5 ఓవర్లలో 108/4 (షెఫాలీ 32, హర్మన్‌‌ 29 రిటైర్డ్‌‌ హర్ట్,  జెమీమా 23, ఫాతిమా సనా 2/23)