గిల్‌‌‌‌‌‌‌‌ జిగేల్‌‌‌‌..పంత్‌‌‌‌ ధనాధన్‌‌‌‌..గెలుపు దిశగా టీమిండియా

  • తొలి టెస్ట్‌‌‌‌లో గెలుపు దిశగా టీమిండియా
  • ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 287/4 డిక్లేర్డ్‌‌‌‌
  • బంగ్లాదేశ్‌‌‌‌ లక్ష్యం 515, ప్రస్తుతం 158/4 

చెన్నై : బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఇండియా విజయానికి ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (176 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 119 నాటౌట్‌‌‌‌‌‌‌‌), రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ (128 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 13 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 109) సెంచరీలతో దుమ్మురేపడంతో.. శనివారం మూడో రోజు ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను 64 ఓవర్లలో 287/4 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌‌‌‌‌ చేసింది. దీంతో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ ముందు 515 రన్స్‌‌‌‌‌‌‌‌ భారీ లక్ష్యాన్ని ఉంచింది. 

దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 37.2 ఓవర్లలో 158/4 స్కోరు చేసింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ నజ్ముల్‌‌‌‌‌‌‌‌ షాంటో (51 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), షకీబ్‌‌‌‌‌‌‌‌ (5 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. అశ్విన్‌‌‌‌‌‌‌‌ 3 వికెట్లు తీశాడు. ప్రస్తుతం రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా గెలుపుకు ఇంకా 357 రన్స్‌‌‌‌‌‌‌‌ కావాలి. 

ఇద్దరూ.. ఇద్దరే

81/3 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో పంత్‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌ పోటీపడి ఆడారు. ఒకరి తర్వాత ఒకరు బంగ్లా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఉతికి ఆరేశారు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై సెంచరీ చేసిన తర్వాత ఫామ్‌‌‌‌‌‌‌‌ కోల్పోయిన గిల్‌‌‌‌‌‌‌‌ మళ్లీ ఆ స్థాయిలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఇక పంత్‌‌‌‌‌‌‌‌ తన టీ20 ట్రేడ్‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌ షాట్లతో విరుచుకుపడ్డాడు. వీళ్లను కట్టడి చేసేందుకు బంగ్లా బౌలర్లు చేసిన ఏ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. 

దీంతో 88 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ కొట్టిన పంత్‌‌‌‌‌‌‌‌ ఆ తర్వాత స్కూప్‌‌‌‌‌‌‌‌ షాట్లతో మరింత రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 72 రన్స్‌‌‌‌‌‌‌‌ వద్ద నజ్ముల్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌ డ్రాప్‌‌‌‌‌‌‌‌ చేయడంతో గట్టెక్కాడు. అయినా తన టిపికల్‌‌‌‌‌‌‌‌ షాట్లతో చకచకా బౌండ్రీలు రాబట్టిన పంత్‌‌‌‌‌‌‌‌ షకీబ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఓ డబుల్‌‌‌‌‌‌‌‌తో ఆరో సెంచరీని అందుకున్నాడు. ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌ పూర్తయిన వెంటనే మిడిల్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చి రెండు కళ్లు మూసి పైకి చూస్తూ బ్యాట్‌‌‌‌‌‌‌‌ను గాల్లో ఊపుతూ సంబురాలు చేసుకున్నాడు. అయితే 56వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో మెహదీ హసన్‌‌‌‌‌‌‌‌ (2/103) బాల్‌‌‌‌‌‌‌‌ను భారీ షాట్‌‌‌‌‌‌‌‌కు యత్నించి అతనికే రిటర్న్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. దీంతో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 167 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. 

అప్పటివరకు పంత్‌‌‌‌‌‌‌‌ ఆటను చూసిన గిల్‌‌‌‌‌‌‌‌ ఒక్కసారిగా గేర్‌‌‌‌‌‌‌‌ మార్చాడు. నహీద్‌‌‌‌‌‌‌‌ రాణా (1/21), హసన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కవర్స్‌‌‌‌‌‌‌‌లో చూడముచ్చటైన సిక్సర్లు కొట్టాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (22 నాటౌట్‌‌‌‌‌‌‌‌) కూడా ఫర్వాలేదనిపించడంతో ఇండియా 500 స్కోరు దాటింది. 161 బాల్స్‌‌‌‌‌‌‌‌లో నాలుగో సెంచరీ చేసిన గిల్‌‌‌‌‌‌‌‌.. రాహుల్‌‌‌‌‌‌‌‌తో ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 53 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించాడు. 

అశ్విన్‌‌‌‌ తిప్పేసిండు..

భారీ ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌‌‌‌ను డే చివర్లో అశ్విన్‌‌‌‌ కట్టడి చేశాడు. స్టార్టింగ్‌‌‌‌లో ఓపెనర్లు జాకిర్‌‌‌‌ హసన్‌‌‌‌ (33), షాద్మాన్‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌ (35) ఇండియా పేసర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌‌‌‌కు 62 రన్స్‌‌‌‌ జత చేసి ఇన్నింగ్స్‌‌‌‌ను మంచి స్థితిలో నిలిపారు. కానీ 17వ ఓవర్‌‌‌‌లో బుమ్రా (1/18) ఈ జోడీని విడదీసి  వికెట్ల పతనం మొదలుపెట్టాడు. ఆ వెంటనే అశ్విన్‌‌‌‌ జోరందుకున్నాడు. 

చెపాక్‌‌‌‌ పిచ్‌‌‌‌పై తన ట్రేడ్‌‌‌‌ మార్క్‌‌‌‌ బంతులతో బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఓ ఎండ్‌‌‌‌లో షాంటో నిలకడగా ఆడినా, వరుస విరామాల్లో ఇస్లామ్‌‌‌‌, మోమినల్‌‌‌‌ హక్‌‌‌‌ (13), ముష్ఫికర్‌‌‌‌ రహీమ్‌‌‌‌ (13)ను ఔట్‌‌‌‌ చేసి షాకిచ్చాడు. చివరకు బ్యాడ్‌‌‌‌ లైట్‌‌‌‌ కారణంగా అరగంట ముందే ఆటను ఆపి వేయడంతో బంగ్లా వికెట్ల పతనానికి అడ్డుకట్ట పడింది.