IND vs BAN: హైదరాబాద్‌లో రేపు మూడో టీ20.. తిలక్ వర్మ, హర్షిత్ రాణాలకు ఛాన్స్!

ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం (అక్టోబర్ 12) భారత్, బంగ్లాదేశ్ చివరి టీ20 ఆడనున్నాయి. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇప్పటికే భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరి మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని సూర్య సేన భావిస్తుంది. మరో వైపు కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లాదేశ్ చూస్తుంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 

Also Read :- DSPగా బాధ్యతలు స్వీకరించిన సిరాజ్

 తిలక్, హర్షిత్ లకు ఛాన్స్:

సిరీస్ గెలుచుకోవడంతో ఈ మ్యాచ్ లో రిజర్వ్ ప్లేయర్లకు చోటివ్వాలని భారత్ భావిస్తుంది. ఇందులో భాగంగా బ్యాటర్ తిలక్ వర్మ, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా లాకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య రెస్ట్ తీసుకుంటే అతని స్థానంలో ఈ హైదరాబాదీ బ్యాటర్ ఆడతాడు. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ లో బెంచ్ కు పరిమితం కావొచ్చు. అదే జరిగితే అతని ప్లేస్ లో హర్షిత్ రాణాకు చోటు లభిస్తుంది. ఈ రెండు మార్పులు పక్కాగా ఉండొచ్చు. బిష్ణోయ్ ని ఆడించాలనుకుంటే వరుణ్ చక్రవర్తి రెస్ట్ ఇవ్వడం ఖాయం. జితేష్ శర్మకు అవకాశం ఇవ్వాలనుకుంటే వికెట్ కీపర్ సంజు శాంసన్ త్యాగం చేయక తప్పదు. 

ఈ సిరీస్ లో ఇప్పటివరకు బంగ్లాదేశ్.. టీమిండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. తొలి రెండు టీ20ల్లో భారీ తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో భారత్ ఛేజింగ్ లో 11.2 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. రెండో టీ20లో 86 పరుగుల తేడాతో గెలిచింది. చివరి టీ20లో భారత్ జోరును తట్టుకొని నిలబడడం కష్టంగానే కనిపిస్తుంది.