తొలి టీ20లో 7 వికెట్లతో టీమిండియా గ్రాండ్ విక్టరీ

  • మెరిసిన అర్ష్‌‌దీప్, చక్రవర్తి, పాండ్యా

గ్వాలియర్‌‌‌‌: టెస్టు సిరీస్ జోష్‌‌ను టీమిండియా టీ20 ఫార్మాట్‌‌లోనూ కొనసాగించింది. పేసర్‌‌‌‌ అర్ష్‌‌దీప్ సింగ్ (3/14) ముందుండి నడిపించగా.. రీఎంట్రీలో వరుణ్‌‌ చక్రవర్తి (3/31), అరంగేట్రంలో మయాంక్‌‌ యాదవ్‌‌ (1/21) కూడా ఆకట్టుకోవడంతో తొలి టీ20లో బంగ్లాదేశ్‌‌ను చిత్తు చేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల  సిరీస్‌‌లో 1–0తో ఆధిక్యంలోకి వచ్చింది. తొలుత బంగ్లా 19.5 ఓవర్లలో 127 రన్స్‌‌కే ఆలౌటైంది. మెహిదీ హసన్ మిరాజ్ (35 నాటౌట్‌‌), కెప్టెన్ నజ్ముల్ శాంటో (27) మాత్రమే రాణించారు. అనంతరం హార్దిక్ పాండ్యా (16 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 నాటౌట్‌‌) మెరుపులతో ఇండియా 11.5 ఓవర్లలోనే 132/3 స్కోరు చేసి గెలిచింది. సంజు శాంసన్ (19 బాల్స్‌‌లో 6 ఫోర్లతో 29), కెప్టెన్ సూర్యకుమార్ (14 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29) కూడా దంచికొట్టారు. అర్ష్‌‌దీప్‌‌  ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్‌‌గా నిలిచాడు. రెండో టీ20 ఢిల్లీలో బుధవారం జరుగుతుంది. 

ఇండియా ధనాధన్..

చిన్న టార్గెట్‌‌ను ఇండియా జెట్ స్పీడ్‌‌లో ఛేజ్‌‌ చేసింది. ఓపెనర్‌‌‌‌గా వచ్చిన సంజు శాంసన్ తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. మరో ఓపెనర్‌‌‌‌ అభిషేక్ శర్మ (16) రెండో ఓవర్లో 6, 4, 4తో రెచ్చిపోయి ఆఖరి బాల్‌‌కు రనౌటయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్‌‌‌‌ ఉన్నంతసేపు తన ట్రేడ్‌‌మార్క్ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఎదుర్కొన్న మూడో బాల్‌‌నే మిడ్‌‌ వికెట్‌‌గా సిక్స్‌‌గా మలిచిన అతను తస్కిన్ వేసిన ఐదో ఓవర్లో రెండు  ఫోర్లు, సిక్స్‌‌ కొట్టాడు. ముస్తాఫిజుర్‌‌‌‌ బౌలింగ్‌‌లోనూ  సిక్స్‌‌ బాది మరో షాట్‌‌కు ట్రై చేసి ఔటవగా.. పవర్‌‌‌‌ ప్లేలోనే ఇండియా 71/2తో నిలిచింది. ఎనిమిదో ఓవర్లో శాంసన్‌‌ను మెహిదీ హసన్ ఔట్‌‌ చేశాడు.  ఈ టైమ్‌లో అరంగేట్రం బ్యాటర్ నితీశ్ రెడ్డి (16 నాటౌట్‌) తోడుగా హార్దిక్ పాండ్యా భారీ షాట్లతో  విజృంభించాడు. తస్కిన్‌‌ వేసిన 12వ ఓవర్‌‌‌‌ మూడో బాల్‌‌ను చూడకుండానే  ర్యాప్‌ షాట్‌కీపర్‌‌‌‌ మీదుగా బౌండ్రీకి పంపాడు. ఈ షాట్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. తర్వాతి రెండు బాల్స్‌‌కు  4,6తో  మ్యాచ్  ముగించాడు.  

బౌలింగ్‌‌ జోరు

తెలుగు కుర్రాడు నితీశ్‌‌ కుమార్ రెడ్డి, స్పీడ్‌‌స్టర్‌‌‌‌ మయాంక్‌‌ యాదవ్‌‌ అరంగేట్రం చేసిన ఈ మ్యాచ్‌‌లో టాస్‌‌ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ సూర్యకుమార్ నిర్ణయానికి ఇండియా బౌలర్లు న్యాయం చేశారు. కొత్త బాల్‌‌తో హడలెత్తించిన అర్ష్‌‌దీప్‌‌ ఓపెనర్లు ఓపెనర్ లిటన్ దాస్ (4), పర్వేజ్ హుస్సేన్ (8)ను పెవిలియన్‌‌ చేర్చి బంగ్లాకు షాకిచ్చాడు. కెప్టెన్ శాంటో.. తౌహిద్ హృదయ్‌‌ (12)తో మూడో వికెట్‌‌కు 28 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ, ఏడో ఓవర్లో తౌహిద్‌‌ను ఔట్‌‌ చేసిన సుందర్‌‌‌‌ ఈ జోడీని విడదీశాడు. తన తొలి ఓవర్‌‌నే మెయిడెన్‌ చేసిన కొత్త పేసర్ మయాంక్ బౌలింగ్‌‌లో మహ్ముదుల్లా (1) పెవిలియన్‌‌ చేరాడు. ఆ వెంటనే జాకిర్ అలీ (8)ని రిటర్న్‌‌  క్యాచ్‌‌తో ఔట్‌‌ చేసిన చక్రవర్తి  సగం ఓవర్లకు బంగ్లాను 64/5తో నిలిపాడు.తర్వాతి ఓవర్లోనే శాంటోను కూడా ఔట్‌‌ చేయడంతో బంగ్లా వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది.  కానీ, ఆల్‌‌రౌండర్‌‌‌‌ మెహిదీ హసన్‌‌..  మయాంక్ బౌలింగ్‌‌లో 4, 6, 4తో రెచ్చిపోయాడు. రిషాద్ హుస్సేన్ (11) నిరాశ పరిచినా.. తస్కిన్‌‌  (12)తో కలిసి స్కోరు వంద దాటించాడు.  హార్దిక్ వేసిన 18వ ఓవర్లో తస్కిన్‌‌ రనౌటవగా.. షోరిఫుల్ (0) క్లీన్ బౌల్డ్‌‌ అయ్యాడు.  ముస్తాఫిజుర్ (1)ను బౌల్డ్‌‌ చేసిన అర్ష్‌‌దీప్ మరో బాల్‌‌ మిగిలుండగానే బంగ్లాను ఆలౌట్‌‌ చేశాడు. 

సంక్షిప్త స్కోర్లు

బంగ్లాదేశ్‌‌: 19.5 ఓవర్లలో  127 ఆలౌట్‌‌ (మెహిదీ హసన్ 35 నాటౌట్‌‌, శాంటో 27, అర్ష్‌‌దీప్‌‌  3/14, చక్రవర్తి 3/31).

ఇండియా: 11.5 ఓవర్లలో 132/3 (హార్దిక్‌‌ 39 నాటౌట్‌‌, సూర్య 29, శాంసన్‌‌ 29, మెహదీ హసన్‌‌ 1/7)