IND vs AUS 3rd Test: మారని కోహ్లీ తీరు.. మరోసారి బలహీనతను బయట పెట్టిన కింగ్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన బలహీనతను బయట పెట్టాడు. ఆఫ్-స్టంప్ వెలుపల పడుతున్న బంతులను హిట్ చేయాలని చూస్తూ.. కీపర్ లేదా స్లిప్ క్యాచ్ ఔట్ అవ్వడం తరచూ చూస్తూనే ఉంటాం. ఎప్పటి నుంచో విరాట్ కు ఈ బలహీనత ఉంది. అతని మైనస్ పాయింట్ పూర్తిగా బౌలర్లు పసిగట్టారు. తాజాగా గబ్బాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో  సోమవారం (డిసెంబర్ 16) కోహ్లీ ఇదే సీన్ రిపీట్ చేశాడు.

ఇన్నింగ్స్ 8వ ఓవర్ రెండో బంతిని జోష్ హాజిల్‌వుడ్ ఆఫ్ స్టంప్ కు దూరంగా విసిరాడు. ఆఫ్ స్టంప్ అవతల పడ్డ బంతిని ఆడే క్రమంలో బంతి కోహ్లీ బ్యాట్‌కు ఎడ్జ్ అయి నేరుగా కీపర్ అలెక్స్ క్యారీ చేతిలోకి వెళ్లింది. దీంతో 3 పరుగులకే కింగ్ పెవిలియన్ కు చేరాడు. కోహ్లీ ఔట్ కావడంతో భారత్ 22 పరుగుల వద్ద 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. వినడానికి షాకింగ్ గా అనిపించినా కోహ్లీ ఇదే రీతిలో ఔట్ కావడం ఇది 51 వ సారి. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి.. దిగ్గజ హోదాలో ఉన్న విరాట్ తన బలహీనతను అధిగమించలేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. 7 వికెట్ల నష్టానికి 405 పరుగులతో మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 40 జోడించింది. క్యారీ 70 పరుగులు చేశాడు. అంతకముందు తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలు చేసి ఆస్ట్రేలియా భారీ స్కోర్ అందించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజ్ లో రాహుల్ (14), రిషబ్ పంత్ (4) ఉన్నారు. ప్రస్తుతం భారత్ 418 పరుగులు వెనకబడి ఉంది.