IND vs AUS 3rd Test: ముగిసిన మూడో రోజు ఆట.. టీమిండియాను కాపాడిన వర్షం

బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసింది. రెండో రోజు పూర్తిగా ఆట జరగగా.. మూడో రోజు వర్షం అంతరాయం కలిగించింది. ఆట మధ్యలో పలుమార్లు వర్షం రావడం అభిమానులతో పాటు ఆటగాళ్లకు విసుగు తెప్పించింది. దీంతో కేవలం 30 ఓవర్ల ఆట కూడా జరగలేదు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజ్ లో రాహుల్ (33), రోహిత్ శర్మ (0) ఉన్నారు.

ప్రస్తుతం భారత్ 394 పరుగులు వెనకబడి ఉంది. మూడో రోజు వర్షం రావడం టీమిండియాకు కలిసి వచ్చింది. ఆసీస్ పేసర్లు విజృంభించడంతో నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. జైశ్వాల్(4), గిల్(1), కోహ్లీ (3) ,పంత్(9) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఈ దశలో భారత్ ఫాలో ఆన్ ఆడుతుందేమో అనిపించింది. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ డ్రా చేసుకునే అవకాశం భారత జట్టుకు కలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు వికెట్లు తీసుకోగా.. హేజల్ వుడ్, కమ్మిన్స్ తలో వికెట్ తీసుకున్నారు.    

ALSO READ | BBL 14: ఔటయ్యాడని గ్రౌండ్‌లోనే బ్యాట్ విసిరేసిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

 మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. 7 వికెట్ల నష్టానికి 405 పరుగులతో మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 40 జోడించింది. క్యారీ 70 పరుగులు చేశాడు. అంతకముందు తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలు చేసి ఆస్ట్రేలియా భారీ స్కోర్ అందించారు.