మనదే జోరు .. పట్టు బిగించిన ఇండియా

  • మెరిసిన జైస్వాల్‌‌‌‌, రాహుల్
  • రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 172/0
  • తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో ఆసీస్104 రన్స్‌‌‌‌కే ఆలౌట్‌‌‌‌
  • బుమ్రాకు ఐదు వికెట్లు

పెర్త్‌‌‌‌:బోర్డర్–గావస్కర్ ట్రోఫీని టీమిండియా విజయంతో ఆరంభించేందుకు గట్టి పునాది వేసుకుంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పూర్తి పట్టు బిగించింది. కెప్టెన్‌‌‌‌, పేస్ లీడర్ జష్‌‌‌‌ప్రీత్ బుమ్రా  (5/30 ) ఖతర్నాక్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌కు కొనసాగింపుగాఓపెనర్లు యశస్వి జైస్వాల్ (193 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 90 బ్యాటింగ్‌‌‌‌), కేఎల్ రాహుల్ (153 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 62 బ్యాటింగ్‌‌‌‌) బ్యాట్‌‌‌‌తో మెప్పించారు. 

దాంతో రెండో రోజు, శనివారం ఆట చివరకు రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో ఇండియా 172/0 స్కోరు చేసింది. మొత్తంగా 218 రన్స్ ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకెళ్తోంది. అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 67/7తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 104 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. 

మిచెల్ స్టార్క్ (112 బాల్స్‌‌లో 26) గొప్పగా పోరాడి స్కోరు వంద దాటించాడు. మరో రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రా ఈ ఫార్మాట్‌లో11వ సారి ఐదు వికెట్ల స్పెల్‌‌‌‌ సాధించాడు. హర్షిత్‌‌‌‌ రాణా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఓపెనర్లు రెండు సెషన్ల పాటు ఓపిగ్గా ఆడటంతో  ఆసీస్‌‌‌‌కు ఇండియా భారీ టార్గెట్‌‌‌‌ ఇచ్చేలా ఉంది. చేతిలో పది వికెట్లు, మరో మూడు రోజుల ఆట మిగిలున్న నేపథ్యంలో 350–400 టార్గెట్‌‌‌‌ ఇస్తే బుమ్రాసేన విజయానికి ఢోకా ఉండదు. 

పరీక్ష పెట్టిన స్టార్క్

బుమ్రా దెబ్బకు తొలి రోజు ఆసీస్‌‌‌‌ టాప్‌‌‌‌, మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ ఆటగాళ్లంతా బ్యాట్లెత్తేయగా.. రెండో రోజు టెయిలెండర్ స్టార్క్‌‌‌‌ ఇండియాను విసిగించాడు. ఆట మొదలైన రెండో ఓవర్లోనే ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ అలెక్స్ క్యారీ (21)ని ఔట్‌‌‌‌ చేసిన బుమ్రా జట్టుకు మంచి ఆరంభం అందించాడు.

 కాసేపటికే నేథన్‌‌‌‌ లైయన్‌‌‌‌ (5)ను హర్షిత్‌‌‌‌ రాణా షార్ట్‌‌‌‌ బాల్‌‌‌‌తో పెవిలియన్ చేర్చాడు. దాంతో ఆసీస్‌‌‌‌ 79/9తో నిలిచింది. కానీ, ఈ దశలో స్టార్క్‌‌‌‌ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఓఎండ్‌‌‌‌లో హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ (31 బాల్స్‌‌‌‌లో 7 నాటౌట్‌‌‌‌) నిలబెట్టి  అద్భుతంగా పోరాడాడు. 

బలమైన డిఫెన్స్‌‌‌‌తో తొలి స్పెల్‌‌‌‌లో బుమ్రా, హర్షిత్‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ బంతులను ఎదుర్కొన్నాడు. రాణా  షార్ట్‌‌‌‌ బాల్స్‌‌‌‌ స్ట్రాటజీ స్టార్క్‌‌‌‌ ముందు వర్కౌట్ కాలేదు. ఓ బాల్‌‌‌‌ హెల్మెల్‌‌‌‌కు, మరోటి భుజానికి తగిలినా ఆసీస్‌‌‌‌ ఆటగాడు వెనక్కుతగ్గలేదు. 

ఐపీఎల్‌‌‌‌లో తన కేకేఆర్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌మేట్‌‌‌‌ అయిన రాణా పదే పదే షార్ట్‌‌‌‌ బాల్స్‌‌‌‌, బాడీలైన్ బాల్స్‌‌‌‌  వేయడంతో  ‘నువ్వు బాగానే బౌలింగ్ చేస్తున్నావు. కానీ, నేను నీకంటే వేగంగా వేయగలను. నాకు జ్ఞాపకశక్తి ఎక్కువ’ అని అతనితో చెప్పాడు.

 సిరాజ్‌‌‌‌, నితీష్ రెడ్డి, స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌కు వచ్చినా ఫలితం దక్కలేదు. బుమ్రా బౌలింగ్‌‌‌‌లో హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ ఇచ్చిన కష్టమైన క్యాచ్‌‌‌‌ను కీపర్‌‌‌‌‌‌‌‌ పంత్ వదిలేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఆసీస్ టెయిలెండర్లు చివరి వికెట్‌‌‌‌కు 25 రన్స్  జోడించారు. చివరకు  రాణా బౌలింగ్‌‌‌‌లో స్టార్క్‌‌‌‌ భారీ షాట్‌‌‌‌ ఆడే ప్రయత్నంలో కీపర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్‌‌‌‌ ఇన్నింగ్స్ ముగిసింది. 

ఓపెనర్లు హిట్‌‌

46 రన్స్ తొలి ఇన్నింగ్స్‌‌‌‌ ఆధిక్యంతో లంచ్‌‌‌‌ బ్రేక్ తర్వాత మరోసారి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇండియాకు ఓపెనర్లు జైస్వాల్‌‌‌‌, రాహుల్‌‌‌‌ మంచి ఆరంభం ఇచ్చారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌‌‌‌లో డకౌటైన జైస్వాల్‌‌‌‌ ఈసారి ఆకట్టుకున్నాడు. మంచి టెన్నిక్‌‌‌‌తో వరుసగా బౌండ్రీలు కొ డుతూ ఆసీస్ బౌలర్లపై పైచేయి సాధించాడు.

 రాహుల్ సైతం మంచి షాట్లతో అలరించాడు. కమిన్స్ బౌలింగ్‌‌‌‌లో కొట్టిన ఆన్ డ్రైవ్‌‌‌‌ ఆటకు హైలైట్‌‌‌‌గా నిలిచింది. పక్కా టెస్టు ఆటతో క్రీజులో పాతుకుపోయిన  ఈ ఇద్దరూ మంచి బాల్స్‌‌‌‌ను డిఫెండ్‌‌‌‌ చేస్తూనే చెత్త బాల్స్‌‌‌‌ను బౌండ్రీలకు తరలించారు. 

క్రీజులో కుదురుకున్న తర్వాత జైస్వాల్‌‌‌‌ ఖతర్నాక్‌‌‌‌ షాట్లతో ఫోర్లు, సిక్సర్లతో జోరు చూపెట్టాడు. ఆసీస్ బౌలర్లు వేసిన షార్ట్‌‌‌‌, ఫుల్‌‌‌‌ లెంగ్త్ బాల్స్‌‌‌‌ను సమర్థవంతంగా తిప్పికొట్టాడు. 84/0తో  టీ బ్రేక్‌‌‌‌కు వెళ్లొచ్చిన ఇండియా ఓపెనర్లు మూడో సెషన్‌‌‌‌లో జాగ్రత్తగా ఆడారు.

 పిచ్‌‌‌‌పై పచ్చిక ఎండిపోయి, పగుళ్లు రావడంతో  ఆసీస్ కెప్టెన్‌‌‌‌ కమిన్స్‌‌‌‌  స్పిన్నర్ నేథన్ లైయన్‌‌‌‌ను ప్రయోగించాడు. తను మెరుగ్గా బౌలింగ్‌‌‌‌ చేయగా.. రాహుల్‌‌‌‌, యశస్వి  ఓపిక చూపెట్టారు. మంచి డిఫెన్స్‌‌‌‌తో లైయన్ స్పిన్‌‌‌‌ను ఎదుర్కొని వికెట్‌‌‌‌ ఇవ్వకుండా రోజు ముగించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఫిఫ్టీలు పూర్తిగా చేసుకోగా.. జైస్వాల్‌‌‌‌ సెంచరీకి చేరువయ్యాడు. ఓపెనర్లు జాగ్రత్తగా ఆడటంతో మూడో సెషన్‌‌‌‌లో 31 ఓవర్లలో 88 రన్స్ మాత్రమే వచ్చాయి. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 150 ఆలౌట్ 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 51.2  ఓవర్లలో 104 ఆలౌట్‌‌‌‌ (స్టార్క్‌‌‌‌ 26, క్యారీ 21 , బుమ్రా 5/30).
ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌: 57 ఓవర్లలో 172/0 (జైస్వాల్ 90 బ్యాటింగ్‌‌‌‌, రాహుల్ 62 బ్యాటింగ్‌‌‌‌).