ఏపీలో ఎన్డీయే కూటమిదే విజయం

  •     ఒడిశాలో బీజేడీ- బీజేపీ హోరాహోరీ అంటున్న ఇండియా టుడే ఎగ్జిట్ పోల్

న్యూఢిల్లీ : ఏపీలో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించనుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన కూటమికి 98 నుంచి 120 సీట్లు వస్తాయని తెలిపింది. వైఎస్సార్ సీపీ అధికారాన్ని కోల్పోయి 55 నుంచి 77 స్థానాలు గెలుచుకోనుందని చెప్పింది. టీడీపీ 78 నుంచి 96  సీట్లు గెలుపొంది, అతిపెద్ద పార్టీగా అవతరించనుందని పేర్కొంది. బీజేపీ 4 నుంచి 6 స్థానాలు, జనసేన 16 నుంచి 18 సీట్లు గెలుచుకోవచ్చని వివరించింది.  

ఒడిశాలో బీజేడీ -బీజేపీకి చెరో 62 నుంచి 80 సీట్లు

ఒడిశాలో బిజు జనతాదళ్ (బీజేడీ), బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగనుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఒడిశా అసెంబ్లీలో 147 సీట్లు ఉండగా రెండు పార్టీలకు చెరో 62 నుంచి 80 సీట్లు వస్తాయని తెలిపింది. బీజేడీ, బీజేపీకి చెరో 42 శాతం ఓట్లు లభిస్తాయని పేర్కొంది. ఒకవేళ ఇదే విధంగా ఫలితాలు వెలువడితే 2004 తర్వాత బీజేడీకి పూర్తి స్థాయి మెజారిటీ లభించకపోవడం ఇదే తొలిసారి అవుతుంది. ఏ పార్టీ కూడా మెజార్టీ స్థానాలు గెలుచుకోని పక్షంలో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ కూడా ఏర్పడే అవకాశం ఉందని కూడా వెల్లడించింది.