ఎకానమీకి ఏమైంది?

ఎకానమీకి ఏమైంది?

న్యూఢిల్లీ: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా స్థానం ఐదో నుంచి ఏడోస్థానానికి పడిపోయింది. జీడీపీ పెరుగుదల అంతంతమాత్రంగానే ఉంది. ఆటోమొబైల్‌‌, టెలికం సహా చాలా రంగాలు నేలచూపులు చూస్తున్నాయి. స్టాక్‌‌ మార్కెట్‌‌ నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితులు ఆర్థికమాంద్యానికి సంకేతాలని కార్పొరేట్‌‌ కంపెనీల బాసులు చెబుతున్నారు. లార్సన్ అండ్‌‌ టూబ్రో చైర్మన్‌‌ ఏఎం నాయక్‌‌ ఈ విషయమై శుక్రవారం ఆందోళన ప్రకటించారు. ‘‘పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈసారి ఆర్థికవృద్ధి 6.5 శాతం మించే అవకాశం లేదు. ఏడుశాతం సాధిస్తామన్న ప్రభుత్వ ప్రకటన నిజమయ్యే అవకాశాలు లేవు. గత ఏడాది జీడీపీ వృద్ధి 6.8 శాతం నమోదు కావడమే ఇందుకు నిదర్శనం’’ అని స్పష్టీకరించారు. హెచ్‌‌డీఎఫ్‌‌సీ చైర్మన్‌‌ దీపక్‌‌ పరేఖ్‌‌ మాటల్లోనూ ఇదే తరహా ఆందోళన కనిపించింది. ఆర్థిక మందగమనం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన చెప్పారు. నాన్‌‌–బ్యాంకింగ్‌‌ ఫైనాన్స్‌‌ కంపెనీలకు (ఎన్‌‌బీఎఫ్‌‌సీలు), హౌసింగ్‌‌ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్‌‌ఎఫ్‌‌సీలు) లిక్విడిటీ దొరక్కపోవడం వల్ల ఇబ్బందులు ఎక్కువవుతాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే బ్యాంకుల్లో భయాన్ని పోగొట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. మంచి రేటింగ్స్‌‌ ఉన్న ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు, హెచ్‌‌ఎఫ్‌‌సీలకు తప్ప మిగతా వాటికి బ్యాంకుల్లో అప్పులు పుట్టడం లేదని అన్నారు. చిన్న కంపెనీల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని తెలిపారు.

చిన్న కంపెనీలకు చిక్కులు..

ఎంచుకున్న కంపెనీలకు, రంగాలకు మాత్రమే బ్యాంకులు అప్పులు ఇవ్వడం వల్ల గత కొన్ని నెలలుగా చాలా రంగాలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఆయిల్, రియల్‌‌ ఎస్టేట్‌‌, ఆటో, మాన్యుఫాక్చరింగ్‌‌ రంగాల్లో ఉత్పాదకత తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం. స్టాక్ మార్కెట్లు బడ్జెట్‌‌ రోజు నుంచి నష్టాల బాటను వీడటం  లేదు. సూపర్‌‌రిచ్‌‌పై సర్‌‌చార్జ్‌‌ విధిస్తామని బడ్జెట్‌‌ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించడంతో చాలా కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఇక నుంచి ఐపీఓలో ప్రమోటర్లు కనీసం 35 శాతం అమ్మాలన్న నిబంధన చాలా కంపెనీలకు ఇబ్బందిగా మారింది. సూపర్‌‌రిచ్‌‌ నియమం వల్ల ఎక్కువ నష్టపోయేది ఫారిన్‌‌ ఫోర్టిఫోలియో ఇన్వెస్టర్లే కాబట్టి వాళ్లు భారీ ఎత్తున నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ఆర్థికమాంద్యం తాత్కాలికమేనని, ప్రభుత్వం కొన్ని రూల్స్‌‌ను తీసేస్తే పరిస్థితులు చాలా వరకు చక్కబడుతాయని పరేఖ్‌‌ చెప్పారు. ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన కాగ్‌‌ నివేదిక కూడా ఆర్థిక మాద్యం తొంగి చూస్తోందని స్పష్టం చేసింది. జీఎస్టీ  కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడంలో విజయం సాధించలేకపోయిందని స్పష్టం చేసింది.

ఆందోళనగా ఉంది: నిర్మలా సీతారామన్​

భారత ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూసి తాను ఆందోళన చెందుతున్నానని చెప్పలేనని, అలా అని ఆత్మ సంతృప్తిని కూడా వ్యక్తం చేయడం లేదని తాజాగా ఎకనామిక్స్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఆర్థిక మందగమనం నెలకొంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఎదురు గాలులు వీస్తున్నప్పటికీ మునిగిపోకుండా ఉండే శక్తి భారత్‌కు ఉందని ఆమె అన్నారు. కానీ దేశ ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదనే విషయం ఆమె మాటల్లో ఇట్టే అర్థమవుతోంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ అంచనాలు భారీగా పడిపోతుండడం కూడా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఈ ఏడాది పన్ను వసూళ్ల వృద్ధి 18.3 శాతం ఉంటాయని నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అంచనా వేయగా, మొదటి ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.4 శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే మిగతా కాలంలో 22.3 శాతం వృద్ధి రేటును సాధించాలి. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళతామన్న ప్రధాని నరేంద్ర మోదీ సవాల్‌ నెరవేరడం కాస్త కష్టం గానే కనిపిస్తోంది.

కంపెనీల బాసుల వాదన ఇది

  •  రేటింగ్‌ అద్భుతంగా ఉంటే తప్ప బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. దీనివల్ల చిన్న కంపెనీలు అప్పు పుట్టక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
  • కీలకమైన ఎనిమిది రంగాలు నత్తనడక సాగిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులు భారీగా తగ్గాయి.
  • బడ్జెట్‌లో తాజాగా ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాల వల్ల మార్కెట్లకు కష్టాలు మొదలయ్యాయి. సూపర్‌రిచ్‌పై అధికపన్ను వేయడం వల్ల, ఐపీఓలో 35 శాతం పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ తప్పనిసరి చేయడం వల్ల కంపెనీలకు, ఇన్వెస్టర్లకు చాలా సమస్యలు ఏర్పడ్డాయి.
  • అన్ని రంగాలు నెమ్మదించడంతో, స్టాక్​ మార్కెట్లు పడిపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్​ దెబ్బతింటోంది. ఫలితంగా కొత్త పెట్టుబడులు రావడం లేదు. ఆర్థిక వ్యవస్థ ఏమీ బాగాలేదని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఏం కావాలని కార్పొరేట్లు ప్రశ్నిస్తున్నారు.