లడఖ్​లో చైనా స్థావరాలు.. ఆక్రమణలను అనుమతించబోమన్న భారత్

  • దౌత్య మార్గాల ద్వారా నిరసన తెలిపామని వెల్లడి

 న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్​లో చైనా 2 కౌంటీలు(స్థావరాలు) ఏర్పాటు చేయడంపై భారత్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. చైనా అక్రమణలను అనుమంతించబోమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. లడఖ్ ​ప్రాంతంలో హియాన్ కౌంటీ, హెకాంగ్​ కౌంటీ పేరుతో రెండు స్థావరాలను ఏర్పాటు చేశామని వాయువ్య చైనాలోని జిన్​జియాంగ్​ ఉయ్​గుర్​ అటానమస్​ రీజియన్ ​గత నెల 27న వెల్లడించినట్టు అక్కడి ప్రభుత్వ మీడియా కథనాన్ని ప్రచురించింది. 

ఈ  కొత్త కౌంటీలను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సెంట్రల్ కమిటీ,  స్టేట్ కౌన్సిల్​ ఆమోదించాయని, ఇవి హోటాన్ ప్రిఫెక్చర్ ద్వారా నిర్వహించబడతాయని నివేదించింది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ ప్రాంతంలో చైనా ఆక్రమణలను అంగీకరించబోమని ఎంఈఏ అధికార ప్రతినిధి రణ్‌‌‌‌ధీర్‌‌‌‌ జైస్వాల్‌‌‌‌ అన్నారు. ఇలాంటి చట్ట విరుద్ధ, బలవంతపు ఆక్రమణలతో వాటికి చట్టబద్ధత కల్పించలేరని పేర్కొన్నారు. ఇదే అంశంపై దౌత్యమార్గాల ద్వారా చైనాకు తమ నిరసన వ్యక్తం చేసినట్టు వెల్లడించారు.  కొత్త కౌంటీల ఏర్పాటు అనేది ఈ ప్రాంతంలో భారత్‌‌‌‌కు దీర్ఘకాలంగా, స్థిరంగా ఉన్న సార్వభౌమాధికారంపై ఎలాంటి ప్రభావం చూపించబోదని అన్నారు.

మెగా డ్యామ్​పై భారత్​ ఆందోళన

టిబెట్​లో బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్​ నిర్మిస్తామని చైనా చేసిన ప్రకటనపై భారత్​ స్పందించింది. దీనిపై పర్యవేక్షణ కొనసాగిస్తామని, దేశ ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. బ్రహ్మపుత్రకు ఎగువన చేపట్టే నిర్మాణాలతో దిగువ ప్రాంతాలకు ముప్పు లేకుండా చూసుకోవాలని చైనాకు సూచించింది.