IND vs BAN 2nd Test: దుమ్ము దులిపారు: కాన్పూర్ టెస్టులో టీమిండియా ఐదు ప్రపంచ రికార్డులు

నాలుగో రోజు ముందు వరకు కాన్పూర్ టెస్ట్ డ్రా అని సగటు క్రికెట్ అభిమాని ఫిక్సయిపోయారు. రెండు రోజుల్లో నాలుగు ఇన్నింగ్స్ జరగడం అసాధ్యమనుకున్నారు. కట్ చేస్తే ఒక్క రోజులోనే అంతా తారుమారైంది. మనోళ్లు అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్ ఒక్కసారిగా ఫలితం దిశగా దూసుకెళ్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ నెక్స్ట్ లెవల్లో సాగింది. టీ20 క్రికెట్ ఆడుతూ బంగ్లాదేశ్ కు చుక్కలు చూపించారు. ఓ విప్పు వికెట్లు పడుతున్నా తగ్గేదే లేదంటూ చెలరేగి ఆడారు. ఈ క్రమంలో ఏకంగా 5 ప్రపంచ రికార్డులు వచ్చి టీమిండియా ఖాతాలో చేరాయి. 

టెస్ట్ క్రికెట్ లో వేగంగా 50, 100, 150, 200,250 పరుగుల మార్క్ ను చేరుకొని చరిత్ర సృష్టించింది. జైశ్వాల్, రోహిత్ విధ్వంసంతో తొలి 3 ఓవర్లకే భారత్ 50 పరుగులు చేసింది. ఆ తర్వాత జైస్వాల్ విధ్వంసంతో 10.1 ఓవర్లలో 100 పరుగులకు చేరుకుంది. గిల్, కోహ్లీ, రాహుల్ చెలరేగడంతో వేగంగా 18.2 ఓవర్లలో 150 పరుగులు, 24.2 ఓవర్లలో 200 పరుగులు, 30.1 ఓవర్లలో 250 పరుగులు చేసి ఒకే మ్యాచ్ లో 5 ప్రపంచ రికార్డులు నెలకొల్పి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్నింగ్స్ ఆసాంతం భారత్ వేగం తగ్గకపోవడం విశేషం. 

ALSO READ | IND vs BAN 2nd Test: 34.4 ఓవర్లకే భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్.. రసవత్తరంగా కాన్పూర్ టెస్ట్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న బంగ్లా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. ఓపెనర్ షాదాబ్ ఇస్లాం (7) మోమినుల్ హక్ క్రీజ్ లో ఉన్నారు. జాకీర్ హుస్సేన్ (10), నైట్ వాచ్ మెన్ హసన్ మహమ్మద్ (0) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతకముందు దూకుడుగా ఆడి భారత్ 34.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 107/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లా 233 పరుగులకు ఆలౌటైంది.