2 నెలల్లో 125 సార్లు అతి భారీ వర్షాలు..గత ఐదేళ్లలో ఇవే అధికం

2 నెలల్లో 125 సార్లు అతి భారీ వర్షాలు..గత ఐదేళ్లలో ఇవే అధికం

దేశవ్యాప్తంగా ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. గత 2 నెలల్లో అతి భారీ వర్షాలు పడినట్లు ఐఎండీ తెలిపింది. దేశంలో సెప్టెంబర్- అక్టోబర్ మధ్య 125 సార్లు అతి భారీ వర్షాలు రికార్డ్ అయ్యాయని తెలిపారు అధికారులు. గత ఐదేళ్లలో ఇవే అధికమన్నారు. అయితే నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యమవడం, అల్పపీడనాలు అధికంగా ఏర్పడటమే దీనికి కారణమని తెలిపారు. ఉత్తరాఖండ్ లో గతనెల 18, 19 తేదీల్లో కురిసిన అతి భారీ వర్షాల కారణంగా 79 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరులో ఇక్కడ సాధారణంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అందుకు భిన్నంగా ఈసారి 203 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు అధికారులు. 

సాధారణంగా అక్టోబరు 15న రుతుపవనాల ఉపసంహరణ ఉంటుంది. ఈ ఏడాది మాత్రం అక్టోబర్ 25 వరకు రుతుపవనాల తిరోగమనం కంటిన్యూ అయ్యిందన్నారు. అయితే దేశంలో జూన్ -సెప్టెంబరు మధ్య నైరుతి రుతుపవనాల టైంలో సాధారణ వర్షపాతమే రికార్డ్ అయ్యిందన్నారు అధికారులు. దేశంలో వరుసగా మూడో ఏడాది కూడా సాధారణ, అంతకంటే ఎక్కువ స్థాయిలో వర్షాలు కురిశాయి.  నవంబరు నెలలో కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగానే వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈనెల 11 వరకూ వానలు పడే అవకాశముందన్నారు. దీర్ఘకాల సగటుతో పోలిస్తే ఈ వర్షపాతం 122% అధికంగా ఉండొచ్చని ఐఎండీ తెలిపింది.