దేశంలో గత 24 గంటల్లో 18,732 మందికి కరోనా పాజిటివ్
దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96%.. మరణాల రేటు 1.5%
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. గత ఆరు నెలల్లో తొలిసారి అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18,732 కేసులు రికార్డయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఇప్పటివరకు 97.61 లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారని, రికవరీ రేటు 95.82 శాతంగా ఉందని చెప్పింది. గత 24 గంటల్లో 279 మంది చనిపోయారని.. మొత్తం మరణాలు 1,47,622కు చేరాయంది. మరణాల రేటు ప్రస్తుతం 1.44 శాతంగా ఉందని వివరించింది. మొత్తం 1.47 లక్షల మరణాల్లో 70 శాతం వేరే రోగాల వల్లే చనిపోయారని చెప్పింది. ప్రస్తుతం దేశంలో 2,78,690 యాక్టివ్ కేసులున్నాయని, మొత్తం కేసుల్లో ఇవి 2.73 శాతమని వివరించింది. శనివారం నాటికి 16.81 కోట్ల శాంపిళ్లను టెస్టు చేసినట్టు పేర్కొంది. శనివారం ఒక్కరోజు 9.43 లక్షల టెస్టులు చేశామంది.
అత్యధిక కేసులు సెప్టెంబర్ 16న
దేశంలోనే అత్యధికంగా ఈ ఏడాది సెప్టెంబర్ 16న 97,860 కేసులు రికార్డయ్యాయి. అతి ఎక్కువగా సెప్టెంబర్ 21న లక్షా రెండు వేల మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. సెప్టెంబర్ 15న అత్యధికంగా 1,281 మంది మరణించారు. అత్యంత ఎక్కువగా సెప్టెంబర్ 24న 14 లక్షల 92 వేల టెస్టులు చేశారు.
