యూఎన్​ఓ శాంతి పరిరక్షక కమిషన్​కు మళ్లీ ఎంపికైన భారత్

యునైటెడ్​ నేషన్స్​ ఆర్గనైజేషన్ శాంతి పరిరక్షక కమిషన్​(పీబీసీ)లో భారతదేశ ప్రస్తుత పదవీకాలం డిసెంబర్​ 31తో ముగుస్తుంది. అయితే, 2025–26 సంవత్సరానికిగాను కమిషన్​కు భారత్​ తిరిగి ఎంపికైంది. పీబీసీ సంఘర్షణ ప్రభావిత దేశాల్లో శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే అంతర్ ప్రభుత్వ సలహా సంస్థ. దీనిని 2005లో స్థాపించారు. పీబీసీ సాధారణ అసెంబ్లీ, భద్రతా మండలి, ఆర్థిక, సామాజిక మండలి నుంచి ఎన్నికైన 31 సభ్యదేశాలను కలిగి ఉన్నది. యూఎన్​ఓలో ఆర్థిక సహకారం అందించే దేశాలు, సభ్యదేశాల సాయుధ దళాలు, పోలీసు బృందాలు కూడా సభ్యులుగా ఉంటాయి. యూఎన్​ శాంతి పరిరక్షణకు అత్యధిక సిబ్బందిని అందించిన దేశాల్లో భారత్​ కూడా ఒకటి. 

ప్రస్తుతం అబై, సెంట్రల్ అమెరికన్​ రిపబ్లిక్, సైప్రస్​, డెమోక్రటిక్​ రిపబ్లికన్​ ఆఫ్​ కాంగో, లెబనాన్​ మిడిల్​ ఈస్ట్​, సోమాలియా, సౌత్​ సూడాన్​, వెస్ట్రన్​ సహారాలో యూఎన్​ కార్యకలాపాలకు సుమారు ఆరు వేల మంది సైనిక, పోలీస్​ సిబ్బందిని యూఎన్ పీబీసీ మోహరించింది. 180 మంది శాంతి పరిరక్షకులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ సమాఖ్య శాంతి అజెండాలో ఈ సంస్థ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది.