ఆకలి కేకలు ఆగలె : జీహెచ్​ఐలో దిగజారిన ర్యాంకు

ఆకలి కేకలు ఆగలె : జీహెచ్​ఐలో దిగజారిన ర్యాంకు

కోటి విద్యలు కూటి కొరకే అన్నాడో మహానుభావుడు. అవును, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ఏంది.. సీఎం అయితేందీ, పీఎం అయితేందీ! ఎంత పెద్ద పదవున్నా జానెడు పొట్టను నింపడమే మొదటి పని. కానీ, ప్రస్తుతం దేశంలో ఆకలి కేకలు వినపడుతున్నాయి. పట్టెడన్నం దొరక్క జానెడు పొట్టలు అల్లాడుతున్నాయి. పిల్లల బతుకులు ఆగమైతున్నాయి. ఎదిగీ ఎదగని శరీరాలతో కుదేలవుతున్నాయి. ఇదీ ప్రపంచ దేశాల ఆకలి లెక్కలను చూసే గ్లోబల్​ హంగర్​ ఇండెక్స్​ (జీహెచ్​ఐ) విడుదల చేసిన నివేదిక సారాంశం. 117 దేశాల మీద సర్వే చేస్తే, మన దేశం 102వ ప్లేస్​లో నిలిచింది. ఆర్థికంగా, సామాజికంగా మన కన్నా వెనకబడిన దేశాలు, మనకన్నా మెరుగైన స్థానంలో నిలిచాయి. ఇంకా చెప్పాలంటే గత ఏడాదితో పోలిస్తే మరింత దిగజారిపోయింది మన దేశం.

జీహెచ్​ఐలో 102వ ర్యాంకు
గత ఏడాదితో పోలిస్తే దిగజారిన ర్యాంకు
పిల్లల ఎదుగుదల లోపంలో వేరే దేశాల కన్నా ముందు
స్కోరు తగ్గినా పెరగని ర్యాంకు

2018 జీహెచ్​ఐలో ఇండియా 95వ స్థానంలో ఉండేది. 2000వ సంవత్సరంలో 113 దేశాల జాబితాలో 83వ స్థానంలో ఉంది. అప్పుడు జీహెచ్​ఐ స్కోరు చాలా ఎక్కువగా ఉండేది. ఆ స్కోరు ఎంత ఎక్కువుంటే అంత ఎక్కువ ఆకలి సమస్యలున్నట్టు లెక్క. కానీ, ఇప్పుడు ఆ స్కోరు తగ్గినా ర్యాంకు మాత్రం మెరుగుపడలేదు. 2000వ సంవత్సరంలో స్కోరు 38.8గా ఉండేది. ర్యాంకు 83. ఇప్పుడు స్కోరు 30.3కు తగ్గినా 102వ ర్యాంకులో నిలిచి అత్యంత పేద దేశాల కన్నా వెనకబడిపోయింది. ఆకలి సమస్యలు తీవ్రంగా ఉన్న జాబితాలో ఇండియా చేరింది. యెమన్​, డిజిబౌటి వంటి సంక్షోభ దేశాలూ మనకన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. దాయాది పాకిస్థాన్​ మనకన్నా 8 అడుగులు ముందే ఉంది. 94వ ర్యాంకు సాధించింది. నేపాల్​ (73), శ్రీలంక (66), బంగ్లాదేశ్​ (88), మయన్మార్​ (69) మంచి స్థానాల్లో ఉన్నాయి. ఆర్థికంగా మనకన్నా మెరుగైన స్థానంలో ఉండే డ్రాగన్​ కంట్రీ చైనా 25వ ర్యాంకు సాధించింది.

జనాభే సమస్య

ఇండియాలో ఆకలి కేకలు ఎక్కువవడానికి కారణం పెరుగుతున్న జనాభేనని జీహెచ్​ఐ అభిప్రాయపడింది. జనాభా పెరుగుతున్న కొద్దీ చాలా మందిపోషకాహార లోపానికి బాధితులవుతున్నారని పేర్కొంది. దాని వల్లే పిల్లలు సరిగ్గా ఎదగట్లేదని వెల్లడించింది. సర్వే చేసిన 117 దేశాల జాబితాలో మన దేశంలోనే ఎక్కువగా పిల్లలు బక్కచిక్కిపోతున్నారని పేర్కొంది. 20.8 శాతం మంది పిల్లలు చైల్డ్​ వేస్టింగ్​ (బక్కచిక్కిపోవడం)తో బాధపడుతున్నారని తెలిపింది. 37.9 శాతం మంది పిల్లలు ఎత్తు పెరగట్లేదని పేర్కొంది. ఇందులోనూ ఇండియానే ముందుంది. మంచి తిండి అందుతున్న 6 నుంచి 23 నెలల పిల్లలు కేవలం 9.6 శాతం. అయితే, ఐదేళ్ల లోపు పిల్లల మరణాల్లో మాత్రం ఇండియా పురోగతి సాధించినట్టు రిపోర్టు పేర్కొంది. 2015–16 నాటికి 90 శాతం ఇళ్లకు మంచినీటి సౌకర్యం కల్పించినా, 39 శాతం ఇళ్లలోనే మరుగుదొడ్లున్నాయి. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్​ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇప్పుడిప్పుడే ఫలితాలు కనిపిస్తున్నాయని జీహెచ్​ఐ తేల్చి చెప్పింది. ఇంకా చాలా మందికి లెట్రిన్​ సౌకర్యం లేదని చెప్పింది.

17 దేశాలు టాప్

ఆకలి సమస్యలు తీర్చడంలో 17 దేశాలు టాప్​లో నిలిచాయి. కలిసి ఫస్ట్​ ర్యాంకును పంచుకున్నాయి. బెలారస్​, బోస్నియా అండ్​ హెర్జిగోవినా, బల్గేరియా, చిలీ, కోస్టారికా, క్రొయేషియా, క్యూబా, ఎస్టోనేషియా, కువైట్​, లాత్వియా, లిథువేనియా, మోంటినీగ్రో, రుమేనియా, స్లొవాక్​ రిపబ్లిక్​, టర్కీ, ఉక్రెయిన్​, ఉరుగ్వేలు 5 కన్నా తక్కువ స్కోరు సాధించి మెరుగైన స్థానాల్లో నిలిచాయి.

3 డొమైన్లు.. 4 కేటగిరీలు

సర్వేని జీహెచ్​ఐ 3 డొమైన్లు, 4 కేటగిరీలుగా చేసింది. ఆహార కొరత (పోషకాహార లోపం), పిల్లల మరణాలు (ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు), పిల్లల పోషకాహార లోపాల (బక్కపలచని పిల్లలు, ఎదుగుదల లోపం) లెక్కల ఆధారంగా సర్వే చేసింది.