46,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్‌‌‌‌లు ఏర్పాటు

46,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్‌‌‌‌లు ఏర్పాటు
  • అల్వారెజ్ మార్సల్ వైట్​పేపర్​వెల్లడి

న్యూఢిల్లీ: గ్లోబల్ ఈవీ మార్కెట్​తో పోటీపడాలంటే మనదేశంలో కొత్తగా వేలాది ఎలక్ట్రిక్​ వెహికల్ ​(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అవసరమని తాజా స్టడీలో వెల్లడయింది. గ్లోబల్ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌ను చేరుకోవడానికి భారతదేశం 2030 నాటికి 46,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్‌‌‌‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈవీ–ఛార్జర్ నిష్పత్తిని పరిశీలిస్తే  చైనా, నెదర్లాండ్స్ రెండింటికీ 6 చొప్పున, అమెరికాలో 19 చొప్పున ఉండగా, భారతదేశం ఇది 135గా ఉంది. అంటే చైనాలో ఆరు కరెంటు బండ్లకు ఒక చార్జర్​ ఉండగా, భారతదేశంలో 135 ఈవీలకు ఒక ఛార్జర్ ఉందని గ్లోబల్​ ప్రొఫెషనల్ సేవల సంస్థ అల్వారెజ్ మార్సల్ వైట్ ​పేపర్​ పేర్కొంది. ఢిల్లీలో జరిగిన ఈవీకాన్​ ఇండియా 2022లో జరిగిన ఎలక్ట్రిక్ వెహికల్ కాన్ఫరెన్స్‌‌‌‌లో పేపర్‌‌‌‌ను రిలీజ్​చేసింది. స్థోమత, తక్కువ రేంజ్, సప్లై చెయిన్, ప్రొడక్షన్ సెక్యూరిటీ & క్వాలిటీ ఫైనాన్సింగ్​ వంటివి ఈవీ కొనుగోలుకు అడ్డంకులుగా మారాయని తెలిపింది.

సమస్యలు ఉన్నప్పటికీ భారతదేశం రాబోయే కాలంలో ఈవీలను వేగంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. సరఫరా గొలుసు, ఉత్పత్తి భద్రత, బ్యాటరీ ఇన్నొవేషన్లు, ఛార్జింగ్ ఇన్​స్టలేషన్లు, ఫైనాన్సింగ్ అడ్డంకులను తొలగిస్తే పరిశ్రమలోని ఉప–విభాగాలు వచ్చే ఐదేళ్లలో 50–100 శాతం కాంపౌండెండ్ ​యావరేజ్​ గ్రోత్​తో ముందుకు వెళ్తాయి. ప్రభుత్వ మద్దతుతో పాటు పరిశ్రమల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించగలిగితే భారతదేశం ఈవీలకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మార్కెట్లు, తయారీ కేంద్రాలలో ఒకటిగా మారగలదని అల్వారెజ్ & మార్సల్ ఇండియా ఎండీ మనీష్ సెహగల్ అన్నారు. ఇదే సమావేశంలో నీతి ఆయోగ్ అడ్వైజర్ (ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ & ఎలక్ట్రిక్ మొబిలిటీ) సుధేందు సిన్హా మాట్లాడుతూ.. ఇండియాను గ్లోబల్​ హబ్​గా తీర్చిదిద్దడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని చెప్పారు. ఈవీ కాంపోనెంట్లు, బ్యాటరీల ఎగుమతుల్లో నంబర్​వన్​ స్థానానికి ఎదగాలన్నారు.