గోధుమలు దిగుమతి చేసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదు

గోధుమలు దిగుమతి చేసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదు

న్యూఢిల్లీ:  దేశ అవసరాలకు సరిపడా గోధుమలు ఉన్నాయని, వీటిని దిగుమతి చేసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని అధికారిక వర్గాలు తెలిపాయి.   ఫుడ్  కార్పొరేషన్  ఆఫ్  ఇండియా (ఎఫ్‌‌సిఐ) వద్ద రేషన్​షాపులకు సప్లై చేయడానికి సరిపడా స్టాక్‌‌ ఉందని చెప్పాయి. కేంద్రం ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవచ్చని వార్తలు రావడంతో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. ఈసారి మనదేశంలో గోధుమల ఉత్పత్తి దాదాపు 3 శాతం తగ్గి 106.84 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని అంచనా.  మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 2021–-22 పంట సంవత్సరంలో రికార్డు స్థాయిలో 315.72 మిలియన్ టన్నులకు చేరుకుందని సాగురంగ నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్,  హర్యానాలో వేడిగాలుల వల్ల గోధుమ ఉత్పత్తి తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2021–22 పంట సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన అంచనాల ప్రకారం, వరి, మొక్కజొన్న, శనగలు, పప్పుధాన్యాలు,   ఆవాలు, నూనెగింజలు,  చెరకు రికార్డు స్థాయిలో పండుతాయి.  

దేశీయ సరఫరాలను పెంచడానికి,  ధరలను నియంత్రించడానికి గోధుమలపై 40 శాతం దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని  గోధుమ పిండి మిల్లర్ల సంఘం డిమాండ్ చేసింది. ఫెడరేషన్‌‌ సభ్యులు బుధవారం కేంద్ర ఆహార కార్యదర్శి సుధాంశు పాండేతో సమావేశమై మార్కెట్‌‌లో  గోధుమల ధరల పెరుగుదలపై, కొరతపై చర్చించారు. గడచిన 15 రోజుల్లో గోధుమ ధర క్వింటాల్‌‌కు రూ.300-–350 పెరిగిందని ఫెడరేషన్ ప్రెసిడెంట్ అంజనీ అగర్వాల్ తెలిపారు. పంట కాలం కేవలం నెల రోజుల క్రితమే ముగిసింది. ఎనిమిది నెలల తర్వాత మాత్రమే కొత్త పంట వస్తుంది. పోయిన కొన్ని రోజులుగా గోధుమ లభ్యత లేకపోవడం , ధర విపరీతంగా పెరగడంపై ఈ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.  పరిశ్రమలకు టెండర్ ప్రక్రియ ద్వారా ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద గోధుమలను ఇవ్వాలని డిమాండ్ చేసింది. వేడి గాలుల కారణంగా గోధుమ ఉత్పత్తి దెబ్బతింటుందనే ఆందోళనల మధ్య  కేంద్రం గోధుమ ఎగుమతులను నిషేధించింది.