న్యూఢిల్లీ: దేశంలో అందుబాటులోకి రానున్న తొలి కరోనా వ్యాక్సిన్‌గా ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా నిలవనుందని సమాచారం. ఈ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి కేంద్ర ప్రభుత్వం వచ్చే వారంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ప్రకారం తెలుస్తోంది. ఈ మేరకు వ్యాక్సిన్‌కు సంబంధించిన అనుమతులు కోరుతూ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) కేంద్రానికి అదనపు సమాచారాన్ని పంపనుంది. దీనికి కేంద్రం సరేనంటే వ్యాక్సిన్ మార్కెట్‌లో విడుదలవుతుంది.
ఒకవేళ ఇదే జరిగితే బ్రిటిష్ కంపెనీ అయిన ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తొలి దేశం భారత్ అవుతుంది. అల్ప ఆదాయ దేశాలకు ఈ వ్యాక్సిన్ వరమని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధర, సులువైన రవాణా, సాధారణ ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతలో చాన్నాళ్ల వరకు నిల్వ ఉంచుకునే అవకాశం ఉండటంతో ఈ వ్యాక్సిన్ వైపు ఎక్కువ దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఫైజర్ కంపెనీతోపాటు స్థానిక సంస్థ అయిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్‌కు అనుమతులు ఇవ్వడం పైనా కేంద్రం సమాలోచనలు చేస్తోంది.
