IND vs AUS: సిక్సర్‎తో జైశ్వాల్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న భారత్

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అద్భుతంగా ఆడుతుంది. మూడో రోజు తొలి సెషన్ లో ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మూడో రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 275 పరుగులు చేసింది. ఓపెనర్ జైశ్వాల్ (141) పడికల్ (25) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 321 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

వికెట్ నష్టపోకుండా 172 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు జైశ్వాల్ రాహుల్ రెండో రోజు జోరు కొనసాగించారు. ఈ క్రమంలో జైశ్వాల్ 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిక్సర్ తో జైశ్వాల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. మరో ఎండ్ లో ఖచ్చితంగా సెంచరీ చేస్తాడనుకున్న రాహుల్ స్టార్క్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో పడికల్ తో కలిసి జైశ్వాల్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. సెంచరీ తర్వాత మరింత జోరు పెంచి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. 

ఈ సెషన్ లో మరో వికెట్ పడకుండా భారత్ ఆధిక్యాన్ని 300 పరుగులు దాటించారు. తొలి సెషన్ లో భారత్ 27 ఓవర్లలో 103 పరుగులు రాబట్టింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ కు ఏకైన వికెట్ దక్కింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేస్తే.. ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది.