IND vs AUS: జైశ్వాల్, రాహుల్ నిలకడ.. పెర్త్ టెస్టులో పట్టు బిగిస్తున్న భారత్

పెర్త్ టెస్టులో టీమిండియా దూకుడు కొనసాగిస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా మొదటి బౌలింగ్ లో రాణించిన మన ఆటగాళ్లు.. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ పట్టుదలను ప్రదర్శించారు. ఓపెనర్లు రాహుల్, జైశ్వాల్ అద్భుతంగా ఆడడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. వీరిద్దరూ రెండో సెషన్ లో వికెట్ పడకుండా ఆడడంతో భారత్ రెండో రోజు టీ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. క్రీజ్ లో జైశ్వాల్ (42), రాహుల్ (34) ఉన్నారు.

46 పరుగుల ఆధిక్యంతో రెండో సెషన్ ప్రారంభించిన భారత్ కు రాహుల్, జైశ్వాల్ మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఆచితూచి ఆడుతూ కంగారూల బౌలర్లకు అసలు అవకాశం ఇవ్వలేదు. ప్రశాంతంగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో ప్రస్తుతం 130 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ సెషన్ లో ఆసీస్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది.    

Also Read :- తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ

7 వికెట్లకు 67 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు 37 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది. కేవలం 104 పరుగులకే కుప్పకూలడంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల విలువైన భాగస్వామ్యం లభించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ధాటికి కేవలం 150 పరుగులకే ఆలౌటయ్యారు.