IND vs NZ 2nd Test: ఒక్క సెషన్‌లో 6 వికెట్లు.. భారత్‌ను చుట్టేసిన సాంట్నర్, ఫిలిప్స్

పూణే టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. పిచ్ స్పిన్నర్లకు అనూకూలిస్తుండడంతో న్యూజిలాండ్ స్పిన్నర్లు చెలరేగారు. భారత బ్యాటర్లను ఒక్కొక్కరిగా పెవిలియన్ కు చేరుస్తూ మ్యాచ్ పై పట్టు బిగిస్తున్నారు. ఆల్ రౌండర్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ విజృంభించడంతో భారత్ రెండో రోజు లంచ్ సమాయానికి 107 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో జడేజా(11), సుందర్ (2) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులు వెనకబడి ఉంది. 

వికెట్ నష్టానికి 16 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు గిల్, జైశ్వాల్ ఇన్నింగ్స్ ను చక్కగా ముందుకు తీసుకెళ్లారు. బంతి బాగా టర్న్ అవుతుండడంతో ఆచితూచి బ్యాటింగ్ చేశారు. నిదానంగా భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపారు. జట్టు స్కోర్ 50 పరుగుల వద్ద సాంట్నర్ భారత్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. క్రీజ్ లో కుదురుకుంటున్న గిల్ (30) ను ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు. ఆ తర్వాత కోహ్లీ ఒక పరుగు మాత్రమే చేసి సాంట్నట్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. 

వెంటనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ భారత్ కు పార్ట్ టైం బౌలర్ ఫిలిప్స్ ఊహించని షాకిచ్చాడు. అతడు జైస్వాల్ (30) తో పాటు పంత్ (18) ను ఔట్ చేసి భారత్ ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. లంచ్ కు ముందు సాంట్నర్ భారత్ కు మరో స్ట్రోక్ ఇచ్చాడు. సర్ఫరాజ్(11), అశ్విన్ (4) లను స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు పంపాడు. జడేజా, సుందర్ మరో వికెట్ పడకుండా సెషన్ ను ముగించారు. సాంట్నర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఫిలిప్స్ రెండు.. సౌథీ ఒక వికెట్ పడగొట్టారు. కివీస్ ఈ ఒక్క సెషన్ లోనే 6 వికెట్లు పడగొట్టి భారత్ పై చేయి సాధించింది. అంతకముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులకు ఆలౌటైంది.