డేంజర్ జోన్ లో ఎకానమీ!

డేంజర్ జోన్ లో ఎకానమీ!

న్యూఢిల్లీఆర్‌‌బీఐ మాజీ గవర్నర్‌‌ రఘురామ్‌‌ రాజన్‌‌ వరుసగా రెండోరోజూ కూడా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. రియల్‌‌ ఎస్టేట్‌‌, కన్‌‌స్ట్రక్షన్‌‌ రంగాలు టైంబాంబ్‌‌లా మారాయని, అవి ఎప్పుడు కుప్పకూలుతాయో తెలియదని శనివారం వ్యాసం రాసిన ఈ ఎకానమిస్టు, ఆదివారం కూడా బాంబులు పేల్చారు. ఎకానమీపై సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం తీరును వేలెత్తిచూపారు. మోడీ సర్కారు విధానాలు సరిగ్గా లేవని కుండబద్దలు కొట్టారు. ఇండియా ఎకానమీ నీరసించి పోతున్నదని,  మందగమనం నడిమధ్యలో ఉందని హెచ్చరించారు. అధికారం అంతా ప్రధానమంత్రి ఆఫీసులో ఉండటం, మంత్రులకు పవర్స్‌‌ లేకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందంటూ ఇండియా టుడే పత్రికలో వ్యాసం రాశారు.

‘‘పోటీతత్వాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇండియా వెంటనే ఫ్రీ ట్రేడ్‌‌ అగ్రిమెంట్లను కుదుర్చుకోవాలి. భూమి, పెట్టుబడి, కార్మికశక్తి సులువగా దొరికేలా మార్పులు తీసుకురావాలి. ఇన్వెస్ట్‌‌మెంట్లు పెరిగేలా నిర్ణయాలు ఉండాలి. తప్పు ఎక్కడ జరుగుతున్నదంటే.. అధికారం అంతా ప్రధానమంత్రి ఆఫీసులోనే ఉంది. అన్ని నిర్ణయాలూ అక్కడి నుంచే వస్తున్నాయి. ప్రధాని, పీఎంఓలో ఉండే కొందరు ఇచ్చిన ఐడియాలు, ప్లాన్లు అమలవుతున్నాయి. పార్టీ పొలిటికల్‌‌, సోషల్‌‌ ఎజెండా కోసం మాత్రమే ఇలాంటి విధానాలు సరిపోతాయి. ఆర్థిక సంస్కరణల విషయంలో కేవలం కొందరు వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. రాష్ట్రస్థాయి ఆర్థిక వ్యవహారాల గురించి మాత్రమే వీరికి అవగాహన ఉంటుంది. జాతీయస్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియదు. స్పష్టమైన ఎజెండా కూడా లేదు. ఇది వరకటి పార్టీలు కూడా కూటమి ప్రభుత్వాలను నడిపినప్పటికీ, ఎకానమీని సరళీకరించడానికి కృషి చేశాయి. అధికారం అంతా ఒక్కచోటే పోగవడం, అధికారం లేక మంత్రులు నిస్సహాయులుగా మిగిలిపోవడం, స్పష్టమైన దూరదృష్టి లేకపోవడం, వేరే అంశాలపై దృష్టి పెట్టడం వల్ల ఎకానమీ బలహీనమవుతుంది. ప్రధానమంత్రి కార్యాలయం మరింత దృష్టి సారిస్తేనే ఆర్థిక సంస్కరణలు ఊపందుకుంటాయి’’ అని రఘురామ్‌‌ రాజన్‌‌ వివరించారు.

నినాదాలుగా మిగిలిపోకూడదు..

‘మినిమం గవర్నమెంట్‌‌, మాగ్జిమం గవర్నెన్స్‌‌’ అంటూ  మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఈ నినాదం నినాదంగానే మిగిలిపోయిందని రాజన్‌‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నినాదం అసలు లక్ష్యం.. ప్రభుత్వం మరింత బాగా పనిచేయడమన్నారు. ఒక వైపు విమర్శిస్తునే కొన్ని విసయాల్లో మెచ్చుకున్నారు కూడా. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి

  • ప్రభుత్వ జోక్యం తగ్గడానికి బదులుగా పెరిగింది.
  • టెక్నాలజీ వాడకాన్ని పెంచడాన్ని మాత్రం ప్రశంసించాలి.
  • లబ్ధిదారుల బ్యాంకుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు పంపించడం చాలా పెద్ద విజయం.
  • ముందుగా సమస్యను పూర్తిగా అర్థం చేసుకుంటే, మోడీ ప్రభుత్వం ఎకానమీ మందగమనం సమస్యను
    పరిష్కరించవచ్చు.
  • సమస్య తీవ్రతను అర్థం చేసుకోకుండా, విమర్శకులందరికీ రాజకీయ సంబంధాలు అంటగట్టకూడదు.
  • మందగమనం తాత్కాలికమేనని అనుకోవడమూ తప్పే!
  • తనకు అనుకూలం కాని వార్తలను, సర్వేలను తక్కువ చేసి చూడటం మంచిది కాదు.
  • పల్లెటూళ్ల ఆర్థిక వ్యవస్థ ఏమీ బాగా లేదు.
  • మనం ఆర్థికమాంద్యానికి దగ్గర్లో ఉన్నాం.

ఇండియా జీడీపీ సెప్టెంబరు క్వార్టర్‌‌లో ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోవడం, ద్రవ్యోల్బణం, వినిమయం తగ్గిన నేపథ్యంలో ఆయన ఈ అంశాలను లేవనెత్తారు. రియల్‌‌ ఎస్టేట్, కన్‌‌స్ట్రక్షన్‌‌ రంగాలు ఎప్పుడైనా కుప్పకూలే ప్రమాదం ఉందని శనివారం నాటి వ్యాసంలో ఆయన హెచ్చరించారు. ఎన్‌‌బీఎఫ్‌‌సీల పరిస్థితి ఏమీ బాగా లేదన్నారు.

రాజన్​ చెప్పిన లోపాలివీ..

  •  ఎన్డీయే ప్రభుత్వం టెక్నాలజీ వాడకం పెంచడాన్ని మాత్రం ప్రశంసించాలి. లబ్ధిదారుల బ్యాంకుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు పంపించడం చాలా పెద్ద విజయం.
  • అధికారం అంతా ఒక్కచోటే పోగవడం, అధికారం లేక మిగతా వాళ్లంతా నిస్సహాయులుగా మిగిలిపోవడం, సరైన దూరదృష్టి లేకపోవడం, వేరే అంశాలపై దృష్టి పెట్టడం వల్ల ఎకానమీ బలహీనమవుతోంది. కొందరు ఇచ్చిన ఐడియాలు, ప్లాన్లు అమలవుతున్నాయి.  ఆర్థిక సంస్కరణల విషయంలో  అందరి అభిప్రాయాలు స్వీకరించాలి. ఆర్థికవేత్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • దివాలా కేసులను త్వరగా పరిష్కరించాలి. కరెంటుకు తగిన ధరలు నిర్ణయించాలి. టెలికాం సెక్టర్‌‌లో పోటీ కొనసాగేలా చూడాలి. రైతులందరికీ లోన్లు దొరికేలా చేయాలి. మంత్రులకూ, రాష్ట్రాలకూ తగినన్ని అధికారాలు ఇవ్వాలి. వ్యక్తిగత ఐటీ రేట్లను తగ్గించకూడదు.