పింక్‌‌ ప్రాక్టీస్‌లో ఇండియా పాస్‌‌..6 వికెట్ల తేడాతో పీఎం ఎలెవన్‌‌పై గెలుపు.. మెరిసిన గిల్‌, హర్షిత్‌

కాన్‌‌బెర్రా : ఆస్ట్రేలియాతో పింక్‌‌ టెస్ట్‌‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌లో ఇండియా అదరగొట్టింది. తొలి రోజు వర్షంతో రద్దవగా.. రెండో రోజు ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (50), యశస్వి జైస్వాల్‌‌ (45), నితీశ్‌‌ కుమార్‌‌ (42), సుందర్‌‌ (42) రాణించడంతో ఇండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌‌పై గెలిచింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన పీఎం ఎలెవన్‌‌ 43.2 ఓవర్లలో 240 రన్స్‌‌కు ఆలౌటైంది. సామ్‌‌ కొన్‌‌స్టాస్‌‌ (107) సెంచరీతో చెలరేగగా, హనో జాకబ్స్‌‌ (61), జాక్‌‌ క్లెటాన్‌‌ (40) ఆకట్టుకున్నారు. 

మ్యాట్‌‌ రెన్‌‌షా (5), జైడెన్‌‌ గుడ్విన్‌‌ (4), ఒలివర్‌‌ డేవిస్‌‌ (0), జాక్‌‌ ఎడ్వర్డ్స్‌‌ (1)  నిరాశపర్చారు. సామ్‌‌, క్లెటాన్‌‌ మూడో వికెట్‌‌కు 109 రన్స్‌‌ జత చేశారు. హర్షిత్‌‌ రాణా 4, ఆకాశ్‌‌దీప్‌‌ 2 వికెట్లు తీశారు. 241 రన్స్‌ టార్గెట్‌ను ఇండియా 42.5 ఓవర్లలోనే ఛేజ్‌ చేసి గెలిచింది. అయినా మొత్తం 47 ఓవర్ల వరకూ బ్యాటింగ్‌ కొనసాగించింది.  యశస్వితో కలిసి రాహుల్‌‌ (27) తొలి వికెట్‌‌కు 75 రన్స్‌‌ జోడించి ఔటయ్యాడు. 

నాలుగో నంబర్‌‌లో వచ్చిన రోహిత్‌‌ శర్మ (3)తో పాటు  సర్ఫరాజ్‌‌ (1) ఫెయిలయ్యాడు. జడేజా (27) ఫర్వాలేదనిపించాడు.  కొన్‌‌స్టాస్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఈ నెల 6 నుంచి అడిలైడ్‌లో ఆసీస్‌, ఇండియా మధ్య పింక్‌ బాల్‌ టెస్టు జరుగుతుంది.