IND vs BAN 2024: అశ్విన్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ డీసెంట్ టోటల్

చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో గౌరవప్రథమమైన స్కోర్ చేసింది. అశ్విన్ సెంచరీతో 376 పరుగులకు ఆలౌటైంది. జడేజా (86), జైశ్వాల్ (56) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. ఓవర్ నైట్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులతో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి రోజు 86 పరుగులతో భారత్ ను ఆదుకున్న జడేజా అదే స్కోర్ వద్ద తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 

ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన ఆకాష్ దీప్ 17 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సెంచరీ హీరో అశ్విన్ రెండో రోజు మరో 11 పరుగులు మాత్రమే జోడించి 113 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో భారత్ 400 పరుగుల మార్క్ దాటలేకపోయింది. 7 పరుగులు చేసిన బుమ్రా చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమ్మద్ కు ఐదు వికెట్లు దక్కాయి. తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు. నహిద్ రానా, మెహదీ హసన్ మిరాజ్ కు తలో వికెట్ లభించింది.          

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 34 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. హసన్ మహ్మద్ బౌలింగ్లో రోహిత్ శర్మ(6) విరాట్ కోహ్లీ (6) సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా..శుభ్మన్ గిల్ డకౌట్ గా వెనుదిరిగాడు.ఈ దశలో ఓపెనర్ జైశ్వాల్ 56 పరుగులు చేసి బాధ్యతాయుత బ్యాటింగ్ చేశాడు. 39 పరుగులు చేసి పంత్ అతనికి చక్కని సహకారం అందించాడు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో భారత్ 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అశ్విన్, జడేజా జోడీ ఏడో వికెట్ కు 199 పరుగుల భాగస్వామ్యం అందించి భారత్ స్కోర్ ను 376 పరుగులకు చేర్చారు.