న్యూఢిల్లీ : మనదేశంలో ఇస్లాంపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్(ఓఐసీ) చేసిన కామెంట్లను విదేశాంగ శాఖ ఖండించింది. ఈ కామెంట్లు సంకుచితత్వంతో కూడుకుని ఉన్నాయని, ఇవి సరికాదని పేర్కొంది. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి బీజేపీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. వారిద్దరి కామెంట్లను ప్రస్తావిస్తూ.. ఇండియాలో ఇస్లాంపై దాడులుపెరిగిపోతున్నాయని ఓఐసీ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ విషయంలో ఓఐసీ కామెంట్లను తిరస్కరిస్తున్నామని, అవి సంకుచితత్వంతో కూడుకుని ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. మరోవైపు, మైనార్టీల హక్కుల ఉల్లంఘన విషయంలో పాకిస్తాన్ కామెంట్లను ఇండియా తప్పుబట్టింది. అసలు మైనార్టీల హక్కులను ఎక్కువగా కాలరాసేదే పాకిస్తాన్ అని, అది ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడింది. కాగా, మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా కామెంట్లు చేసిన నుపుర్ శర్మను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆమె ఫిర్యాదు మేరకు సోమవారం ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
