IND vs AUS 3rd Test: ఆకాష్ దీప్ ఫోర్.. పట్టరాని సంతోషంతో గంభీర్, రోహిత్, కోహ్లీ సంబరాలు

బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా మ్యాచ్ ఓటమి ఖాయమనుకుంటున్న దశలో బయటపడింది. బుమ్రా, ఆకాష్ దీప్ చివరి వికెట్ కు అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత్ ను ఫాలో ఆన్ ప్రమాదం నుంచి కాపాడారు. బౌలింగ్ లో కాకుండా వీరిద్దరూ బ్యాటింగ్ లో సత్తా చాటి మ్యాచ్ ను డ్రా దిశగా తీసుకెళ్తున్నారు. 213 పరుగుల వద్ద భారత్ జడేజా రూపంలో తొమ్మిదో వికెట్ ను కోల్పోయింది. ఫాలో తప్పించుకోవాలంటే భారత్ మరో 33 పరుగులు చేయాలి. 

ఈ దశలో భారత్ ఫాలో ఆన్ ఆడుతుందని అందరూ ఫిక్సయ్యారు. అయితే బుమ్రా, ఆకాష్ దీప్ పట్టుదల చూపించారు. ఆసీస్ పేసర్లు షార్ట్ బాల్స్ తో ఎంతలా విసిగించినా.. ఓపిగ్గా బ్యాటింగ్ చేశారు. ఒక్కో పరుగు తీస్తూ ఫాలో ఆన్ గండం నుంచి తప్పించారు. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే భారత్ మరో నాలుగు పరుగులు చేయాల్సిన దశలో కమ్మిన్స్ బౌలింగ్ లో ఆకాష్ దీప్ థర్డ్ మ్యాన్ దిశగా ఫోర్ కొట్టాడు. ఈ బౌండరీతో భారత్ ఊపిరి పీల్చుకుంది.

Also Read :- డ్రా దిశగా గబ్బా టెస్ట్.. టీమిండియాను కాపాడిన ఆకాష్ దీప్, బుమ్రా

ఫాలో ఆన్ గండం నుంచి భారత్ గట్టెక్కడంతో డ్రెస్సింగ్ రూమ్ లో భారత ఆటగాళ్ల సంబరాలు ఓ రేంజ్ లో సాగాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పట్టరాని సంతోషంతో సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.మ్యాచ్ చివరి రోజు మాత్రమే మిగిలి ఉంది. ఐదో రోజు ఆస్ట్రేలియా చివరి వికెట్ తీసి బ్యాటింగ్ కు దిగాల్సి ఉంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయడం.. టీమిండియాకు టార్గెట్ చేసి ఆలౌట్ చేయడం.. ఒక రోజులో అసాధ్యం. దీంతో గబ్బా టెస్ట్ డ్రా అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. క్రీజ్ లో ఆకాష్ దీప్ (27), బుమ్రా (10) ఉన్నారు. ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయట పడ్డ భారత్.. తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 193 పరుగులు వెనకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్ 4 వికెట్లు తీసుకున్నాడు. స్టార్క్ మూడు వికెట్లు తీసుకోగా.. లియాన్, హేజల్ వుడ్ లకు తలో వికెట్ దక్కింది. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ అయింది.