- మ. 1.30 నుంచి స్పోర్ట్స్18లో లైవ్
అహ్మదాబాద్ : బ్యాటింగ్ ఫెయిల్యూర్‌తో ఇబ్బంది పడుతున్న ఇండియా విమెన్స్ టీమ్ న్యూజిలాండ్‌తో కీలక పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగే చివరి మ్యాచ్‌లో నెగ్గి ఎలాగైనా సిరీస్ నెగ్గాలని ఆశిస్తోంది. ఇది జరగాలంటే ఇండియా బ్యాటర్లు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. తొలి వన్డేల్లో ఆతిథ్య జట్టు నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో కివీస్ గెలిచింది. గత రెండు మ్యాచ్‌లలో ఇండియా బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. రెండో వన్డేలో టాప్, మిడిలార్డర్ చేతులెత్తేయడంతో జట్టు చిత్తుగా ఓడింది.
వైస్ కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన రెండు ఇన్నింగ్స్‌ల్లో 5, 0 స్కోర్లతో తీవ్రంగా నిరాశపరిచింది. జట్టు సిరీస్ నెగ్గాలంటే స్మృతి ఫామ్‌లోకి రావాల్సిందే. మరో ఓపెనర్ షెఫాలీ వర్మతో పాటు జెమీమా రోడ్రిగ్స్, యస్తికా భాటియా బ్యాట్ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ హర్మన్ గత మ్యాచ్‌లో జట్టును గట్టెక్కించలేకపోయింది.
తన కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో హర్మన్ జట్టుకు సిరీస్ అందిస్తుందేమో చూడాలి. రెండో వన్డేలో స్పిన్నర్ రాధా యాదవ్ బ్యాట్‌తోనూ మెప్పించడం సానుకూలాంశం. ఈ పోరులోనూ ఆమె కీలకం కానుంది. మరోవైపు ఇటీవలే టీ20 వరల్డ్ కప్ నెగ్గిన కివీస్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఇండియా గడ్డపై సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది.