IND vs BAN 2024: ఉప్పల్‌లో శివాలెత్తిన భారత్.. టీ20 చరిత్రలో రికార్డ్ స్కోర్

ఉప్పల్ టీ20లో టీమిండియా వీర విధ్వంసం సృష్టించింది. బంగ్లా బౌలర్లకు పీడకల మిగిలిస్తూ భారత టీ20 చరిత్రలో అత్యధిక స్కోర్ చేసింది. వచ్చినవారు వచ్చినట్టు పూనకం వచ్చినట్టు ఆడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ (47 బంతుల్లో 111: 11 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీకి తోడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(35 బంతుల్లో 75: 8 ఫోర్లు, 5 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఔటైనా చివర్లో హార్దిక్ పాండ్య (47), రియాన్ పరాగ్ (34) బ్యాట్ ఝళిపించారు. 

సంజు, సూర్య విధ్వంసం 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ప్రారంభంలోనే అభిషేక్ శర్మ (4) వికెట్ కోల్పోయింది. వికెట్ పడినా భారత్ జోరు ఆగలేదు. ఓపెనర్ సంజుతో పాటు.. కెప్టెన్ సూర్య విజృంభించడంతో పవర్ ప్లే లోనే 82 పరుగులు రాబట్టింది. పవర్ ప్లే తర్వాత ఈ విధ్వంసం ఆగలేదు. కొడితే సిక్సర్ లేకపోతే ఫోర్ అన్నట్టుగా భారత్ ఇన్నింగ్స్ కొనసాగింది. దీంతో తొలి 10 ఓవర్లలోనే 152 పరుగులు రాబట్టింది. ఇన్నింగ్స్ 10 ఓవర్లో రిషద్ బౌలింగ్ లో సంజు వరుసగా 5 సిక్సర్లు బాదడం మ్యాచ్ కు హైలెట్ గా మారింది.  

ఈ క్రమంలో 23 బంతుల్లో సూర్య తన హాఫ్ సెంచరీ.. సంజు శాంసన్ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైనా హార్దిక్ పాండ్య, రియాన్ పరాగ్ బంగ్లాకు చుక్కలు చూపించారు. పరాగ్, హార్దిక్ చెరో 4 సిక్సర్లు బాదారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ సాకిబ్ కు మూడు వికెట్లు దక్కాయి. ముస్తాఫిజుర్ రెహమాన్,తస్కిన్ అహ్మద్,మహ్మదుల్లా తలో వికెట్ పడగొట్టారు.