బార్డర్‌‌లో ఏకపక్ష మార్పులకు ఒప్పుకునేది లేదు

బార్డర్‌‌లో ఏకపక్ష మార్పులకు ఒప్పుకునేది లేదు
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పలు దఫాల చర్చలు జరిగినప్పటికీ ఈ వివాదం కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ఏకపక్ష మార్పులకు ఒప్పుకునేది లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చర్చల ద్వారా త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఎప్పుడూ శాంతికే ప్రాధాన్యత ఇస్తుందని, అయితే దేశ ఆత్మ గౌరవం విషయానికి వస్తే మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. ‘బార్డర్‌‌లో ఏకపక్ష మార్పులకు భారత్ ఒప్పుకోదు. ఇంతకుముందు ఎలా ఉండేదో అలాంటి పరిస్థితుల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరిన్ని మిలిటరీ, దౌత్యపరమైన చర్చల నిర్వహణకు అవకాశాలు ఉన్నాయి. చైనా మన పొరుగు దేశం. అలాంటి వారి నుంచి ఎలాంటి దుందుడుకు చర్చలు జరగకూడదు. పొరుగు దేశాలతో సుహృద్భావ సంబంధాలు కొనసాగించాలని మేం కోరుకుంటున్నాం. భారత్ చరిత్రను చూసుకుంటే ఏ దేశం పైనా మనం దండయాత్ర, ఆక్రమణ, దాడులకు పాల్పడింది లేదు. ఇతరులకు చెందిన అంగుళం భూమినీ మనం ఆక్రమించుకోలేదు. అదే సమయంలో భారత్ తన ఆత్మ గౌరవానికి భంగం కలిగించే చర్యలను అస్సలు సహించబోదన్నదీ స్పష్టం చేస్తున్నాం’ అని రాజ్‌‌నాథ్ పేర్కొన్నారు.