- ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్లు వాడే వారి సంఖ్య బాగా పెరిగిన నేపథ్యంలో డేటా ప్రైవసీ విషయంలో రాజీ పడవద్దని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సూచించారు. క్లయింట్ల డేటాను భద్రంగా కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. ఫిన్‌టెక్ వినియోగంలో గ్లోబల్ సగటు 64 శాతమైతే, మన దేశంలో అది 87 శాతంగా ఉందని చెప్పారు. జనవరి–ఆగస్టు మధ్య కాలంలో దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు రూ. 6 లక్షల కోట్లకు పెరిగాయని, అంతకు ముందు ఏడాది ఇవి రూ. 4 లక్షల కోట్లేనని పేర్కొన్నారు. డేటా ప్రైవసీ చాలా ముఖ్యమైనదని, ఇందులో అందరికీ ఒకేలాంటి అభిప్రాయం ఉండకపోవచ్చని అంటూనే, కాకపోతే ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత తప్పనిసరని నిర్మలా సీతారామన్ చెప్పారు.
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2021లో ఫైనాన్స్ మినిస్టర్ పాల్గొన్నారు. డిజిటల్ పేమెంట్లకు పాటించాల్సిన గైడ్‌లైన్స్‌పై యునైటెడ్ నేషన్స్ తెచ్చిన రిపోర్టును ఈ సందర్భంగా విడుదల చేశారు. డిజిటల్ పేమెంట్ల విషయంలో గవర్నమెంట్లు, యూజర్లు, ఇండస్ట్రీ, బిజినెస్‌లు పాటించడానికి తగిన మార్గదర్శకాలు ఈ రిపోర్టులో ఉన్నాయి. ఫిన్టెక్లో మహిళలు మరింత మంది చురుగ్గా పాల్గొనేలా చూడాల్సిన అవసరం ఉందని ఈ రిపోర్టు వెల్లడించింది. యూఎన్ రిపోర్టు విడుదలకు ఇదే సరయిన సమయమని భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్ల కోసం తీసుకొచ్చే ఇంటరాపరబుల్ సిస్టమ్ పారదర్శకంగా ఉండాలని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీచర్ల విషయంలో రాజీ పడకూడదని పిలుపు ఇచ్చారు. డిజిటల్ పేమెంట్లు, డిజిటల్ యాక్టివిటీస్‌లో గ్లోబల్‌గా అందరి కంటే మన దేశమే ముందు నడుస్తోందని చెప్పారు.
