మాస్టర్ కార్డులపై బ్యాన్.. కొత్తగా ఇష్యూ చేయద్దన్న ఆర్బీఐ

మాస్టర్ కార్డులపై బ్యాన్.. కొత్తగా ఇష్యూ చేయద్దన్న ఆర్బీఐ

ముంబై: అమెరికాకు చెందిన మాస్టర్ కార్డ్ కంపెనీకి భారీ షాక్‌ తగిలింది. ఇండియాలో ఇకపై మాస్టర్ కార్డ్ సంస్థ డెబిట్ కార్డులు గానీ, క్రెడిట్ కార్డులు గానీ ఇష్యూ చేయడానికి లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఆర్బీఐ) నిషేధం విధించింది. డేటా స్టోరేజ్‌ రూల్స్ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెన్ కార్డ్ నెట్‌వర్క్ కంపెనీలు తప్పనిసరిగా ఇండియన్స్‌ పేమెంట్లు, కార్డుల వివరాలకు సంబంధించిన డేటాను ఇండియాలోనే స్టోర్‌‌ చేయాలన్న నిబంధనను అమలు చేసేందుకు మాస్టర్ కంపెనీకి 2018 నుంచి సుదీర్ఘ కాలం అవకాశం ఇచ్చినా,  అమలు చేయలేదని, తమ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో బ్యాన్ తప్పలేదని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఉన్న మాస్టర్ కార్డుల విషయంలో కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ తెలిపింది. కొత్తగా కార్డులు ఇష్యూ చేయకుండా మాత్రమే బ్యాన్ విధించామని, ఈ నిషేధం జులై 22 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది.
ఆర్బీఐ నిర్ణయంపై మాస్టర్ కార్డ్ కంపెనీ స్పందించింది. కొత్త కార్డుల ఇష్యూపై బ్యాన్ విధించడం బాధాకరమని, 2018 నుంచి తాము రెగ్యులర్‌‌గా డేటా విషయంలో ఆర్బీఐకి అప్‌డేట్ ఇస్తూనే ఉన్నామని పేర్కొంది. ఈ ఇష్యూను పరిష్కరించుకునేందుకు అవసరమైన అన్ని డీటైల్స్ ఇస్తామని చెప్పింది.