- రోహిత్, కోహ్లీపైనే అందరి ఫోకస్..ఉ. 5.50 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్
బ్రిస్బేన్ : ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా విషమ పరీక్ష ఎదుర్కోనుంది. నాయకుడిగా జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్‌గా తన స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్న విరాట్ కోహ్లీ అసలైన ‘టెస్టు’కు సిద్ధమయ్యారు. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా పేస్ వికెట్‌పై శనివారం మొదలయ్యే మూడో టెస్టులో ఆస్ట్రేలియాతో రోహిత్‌సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో చెరో మ్యాచ్‌లో నెగ్గిన ఇరు జట్లు ప్రస్తుతం 1–1తో సమంగా ఉన్నాయి. సిరీస్‌లో ముందుకెళ్లేందుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
పింక్ టెస్టులో ఓటమితో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఇండియా మూడో స్థానానికి పడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ కచ్చితంగా నెగ్గాల్సిన అవసరం ఉండటంతో రోహిత్‌సేనపైనే ఒత్తిడి ఉండనుంది. మరోవైపు తొలి టెస్టులో ఓడినా... పింక్ టెస్టులో అద్భుత విజయం సాధించిన ఆస్ట్రేలియా జోరు మీద కనిపిస్తోంది. కాగా, 2021లో గబ్బా టెస్టులో గెలిచిన టీమిండియా బోర్డర్–గావస్కర్ ట్రోఫీని అందుకొని చరిత్ర సృష్టించింది. మూడేండ్ల కిందటి ఆ మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేస్తుందేమో చూడాలి.
బ్యాటర్లపైనే భారం
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్, అడిలైడ్ టెస్టులో టీమిండియా ఓటమికి కారణాలు విశ్లేషిస్తే ముందుగా అందరి చూపు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైపే వెళ్తోంది. వరల్డ్ బెస్టు బ్యాటర్లు, జట్టులో అత్యంత సీనియర్లు అయినప్పటికీ ఈ ఇద్దరూ కొన్నాళ్లుగా తమ స్థాయికి తగ్గట్టు ఆడటం లేదు. బౌన్స్, సీమ్ మూవ్‌వెంట్ అర్థం చేసుకోలేక తడబడుతున్నారు. అదే సమయంలో ఏడాది కాలంగా తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇండియా ఘోరంగా విఫలం అవుతోంది. ఈ సమయంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో 150, అంతకంటే తక్కువ స్కోర్లకే ఆలౌటైంది.
2024–25 సీజన్‌లో రోహిత్, కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు వరుసగా 6.88, 10గా ఉందంటే వీళ్లు ఎంతగా విఫలం అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన విరాట్ ఒత్తిడి నుంచి కాస్త బయట పడ్డాడు. కానీ, ఆఫ్ స్టంప్ చానెల్‌లో పడుతున్న బాల్స్‌ను వెంటాడి ఔటవుతున్న తన బలహీనత నుంచి అతను బయటపడాలి. తన ఆత్మవిశ్వాసం పెరగడానికి రోహిత్ ఇప్పుడు మంచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఆసీస్ వరల్డ్ క్లాస్ ప్లేసర్లు కమిన్స్, మిచెల్ స్టార్క్, ఫిట్‌నెస్ సాధించి తిరిగి బరిలోకి దిగుతున్న జోష్ హేజిల్‌వుడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని జట్టును ముందుండి నడిపించాలి.
తన డిఫెన్స్‌పై నమ్మకం ఉంచలేక హిట్‌మ్యాన్ వికెట్లు పారేసుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయంపై తను ఫోకస్ పెట్టాలి. దానికంటే ముందుగా రోహిత్ తన బ్యాటింగ్ పొజిషన్‌ను డిసైడ్ చేసుకోవాలి. కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా కొనసాగించేందుకు గత పోరులో రోహిత్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి ఫెయిలయ్యాడు. పచ్చికతో కూడిన గబ్బా పేస్ వికెట్‌పై జట్టుకు శుభారంభం అందించేందుకు తన రెగ్యులర్ పొజిషన్‌లోకి వచ్చి యశస్వితో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించే చాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే రాహుల్ మిడిలార్డర్‌కు వెళ్లనున్నాడు. యశస్వి, శుభ్‌మన్ గిల్‌తో పాటు రిషబ్ పంత్ కూడా సత్తా చాటితేనే జట్టు విజయం అందుకుంటుంది.
ALSO READ : IND Vs AUS: తిరిగొచ్చిన స్టార్ పేసర్.. గబ్బా టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఇదే
వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు ఫామ్‌లో ఉండటం శుభసూచకం. ఇక, పేస్ లీడర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నా మరో ఎండ్‌లో తనకు సరైన సపోర్ట్ లభించడం లేదు. గత మ్యాచ్‌లో తేలిపోయిన హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్ తుది జట్టులోకి రావొచ్చు. ఈ మ్యాచ్‌లో ఏకైక స్పిన్ ఆల్‌రౌండర్‌గా అశ్విన్ బదులు విదేశాల్లో మెరుగ్గా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న జడేజాను బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది.
ఆసీస్‌కూ బ్యాటుతోనే సమస్య
టీమిండియా మాదిరిగా ఆస్ట్రేలియాకు కూడా బ్యాటింగ్ విభాగంలో సమస్యలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ అద్భుత సెంచరీతో ఆ జట్టు విజయం సాధించింది. తనదైన రోజున రిషబ్ పంత్ మాదిరిగా దూకుడుగా ఆడే హెడ్ అడిలైడ్‌లో ఆతిథ్య జట్టును గెలిపించాడు. అయితే, స్టీవ్ స్మిత్ ఫామ్ ఆసీస్‌ను ఇబ్బంది పెడుతోంది. ఇండియా బౌలర్లు స్ట్రెయిట్ లైన్స్‌తో తనను ఔట్ చేస్తున్నారు. అడిలైడ్‌లో ఫిఫ్టీ చేసినప్పటికీ మార్నస్ లబుషేన్ మునుపటి ఫామ్ అందుకోలేదు.
గత మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పోరాట పటిమ చూపెట్టిన మెక్‌స్వీని తుది జట్టులో కొనసాగనున్నాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా నుంచి ఆతిథ్య జట్టు మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. కొత్త బంతితో బుమ్రా విసిరే సవాల్‌ను ఎదుర్కోవడం ఆసీస్‌కు కీలకం కానుంది. బౌలింగ్‌లో ఆసీస్‌కు తిరుగు లేదు.
100ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీకి ఇది వందో ఇంటర్నేషనల్ మ్యాచ్.
తుది జట్లు/అంచనా
ఇండియా : జైస్వాల్, రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, రాహుల్, పంత్ (కీపర్), నితీశ్ రెడ్డి, జడేజా / అశ్విన్, సిరాజ్, ఆకాశ్ దీప్ / హర్షిత్ రాణా, బుమ్రా.
ఆస్ట్రేలియా : ఖవాజా, మెక్‌స్వీని, లబుషేన్, స్టీన్ స్మిత్, హెడ్, మిచెల్ మార్ష్, క్యారీ (కీపర్), కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, లైయన్, హేజిల్‌వుడ్.
పిచ్ / వాతావరణం
గబ్బా వికెట్ పేస్‌కు అనుకూలించనుంది. బ్రిస్బేన్‌లో వాతావరణం ప్రస్తుతం కాస్త వేడిగా ఉంది. కానీ తొలి రోజు, నాలుగో రోజు వర్షం కురిసే అవకాశం ఉంది.