పాకిస్థాన్ వెళ్లే ముచ్చటే లేదు.. ఐసీసీకి మరోసారి తేల్చిచెప్పిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్‎కు వేళ్లేందుకు భారత్ నిరాకరించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని పాకిస్థాన్‎కు టీమిండియాను పంపబోమని ఐసీసీకి భారత్ స్పష్టం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్, వేదికను ఖరారు చేయడానికి ఐసీసీ శుక్రవారం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో పాల్గొన్న బీసీసీఐ ప్రతినిధులు.. సెక్యూరిటీ కారణాల వల్ల టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లడం కుదరదని తేల్చి చెప్పారు. రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సెక్యూరిటీ కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమన్న భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 

ALSO READ | ‘హైబ్రిడ్‌’కు ఓకేనా? నేడు తేలనున్న చాంపియన్స్‌ ట్రోఫీ భవితవ్యం

హైబ్రిడ్ మోడ్‎లో ఛాంపియన్స్ ట్రోఫి టోర్నీని నిర్వహించాలని ఐసీసీని భారత్ కోరింది. పాకిస్థాన్‎ క్రికెట్ బోర్డు మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఛాంపియన్స్ ట్రోఫి పాకిస్థాన్ లో నిర్వహిస్తామని.. హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించమని పీసీబీ ఐసీసీకి తేల్చి చెప్పింది. అవసరమైతే భారత్‌ లేకుండానే ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహిస్తామని పీసీబీ కంకణం కట్టుకుని కూర్చుంది. దీంతో ఐసీసీ నిర్ణయంపై క్రికెట్ ప్రియుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. భారత్ అభ్యర్థన మేరకు హైబ్రిల్ మోడల్ ఒకే  చెపుతుందా.. లేక పీసీబీకి అనుకూలంగా వ్యవహరిస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది.