Gabba Test: ఫస్ట్ ఇన్సింగ్స్‎లో భారత్ ఆలౌట్.. వర్షంతో నిలిచిపోయిన మ్యాచ్

బ్రిస్బేన్‎లోని గబ్బా స్టేడియం వేదికగా జరుగుతోన్న టెస్ట్ మ్యాచుకు వరుణుడు మరోసారి అడ్డు తగిలాడు. ఐదో రోజు ఉదయం ఆట ప్రారంభమైన కాసేపటికే వర్షం పడింది. గ్రౌండ్ చిత్తడిగా మారడంతో అఫిషియల్స్ మ్యాచును నిలిపేశారు. అంతకుముందు ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‎లో 260 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 84, ఆల్ రౌండర్ జడేజా రాణించగా.. చివర్లో బౌలర్ ఆకాష్ దీప్ 31 పరుగులు చేసి అద్భుతంగా రాణించడంతో టీమిండియా ఫాలో ఆన్ గండం నుండి గట్టేక్కింది.

 252/9 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‎తో ఐదో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. మరో 8 పరుగులు మాత్రమే చేసి చివరి వికెట్ కోల్పోయింది. బుమ్రా 10 పరుగులతో నాటౌట్‎గా నిలిచారు.  కెప్టెన్ కమిన్స్ 4, మిచెల్ స్టార్క్ 3 తీసి ఇండియాను తక్కువ స్కోర్‎కే కట్టడి చేశారు. హాజల్ వుడ్, నాథన్ లియోన్, ట్రావిస్ హెడ్ తలో వికెట్ తీశారు. 

అతిథ్య ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్సింగ్స్ లో 445 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్ 152, స్మిత్ 101 సెంచరీలతో చెలరేగగా.. చివర్లో అలెక్స్ క్యారీ 70  రన్స్ చేసి జట్టుకు భారీ స్కోర్  అందించారు. ఫస్ట్ ఇన్సింగ్స్‎లో ఆస్ట్రేలియా 445 రన్స్ చేయగా.. టీమిండియా 260 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో ఫస్ట్ ఇన్సింగ్స్‎లో ఆసీస్‎కు 185 పరగుల అధిక్యం దక్కింది.

 అయితే.. మూడో టెస్ట్ తొలి రోజు నుండి వరుణుడు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడు. తొలి రోజు మ్యాచ్ మొత్తం వర్షానికి తుడుచుకుపెట్టుకుపోయింది. మిగిలిన రోజుల్లో అప్పుడప్పుడు వర్షం పడటంతో మ్యాచుకు ఆటంకం కలిగింది. ఐదో రోజు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో గబ్బా టెస్ట్ మ్యాచు ఫలితం తేలకుండా  డ్రా అయ్యే అవకాశం ఉంది.