ఇండియా కుర్రాళ్లు.. సెమీస్‌‌లోనే ఔట్‌‌

అల్‌‌ అమెరాట్‌‌: ఎమర్జింగ్‌‌ మెన్స్ టీ20 ఆసియా కప్‌‌లో ఇండియా–ఎ జట్టు సెమీస్‌‌తోనే సరిపెట్టుకుంది. భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో రమణ్‌‌దీప్‌‌ సింగ్‌‌ (64), ఆయూష్‌‌ బదోనీ (31) మినహా మిగతా వారు విఫలం కావడంతో.. శుక్రవారం జరిగిన నాకౌట్‌‌ పోరులో ఇండియా 20 రన్స్‌‌ తేడాతో అఫ్గానిస్తాన్‌‌–ఎ జట్టు చేతిలో ఓడింది. టాస్‌‌ గెలిచిన అఫ్గాన్‌‌ 20 ఓవర్లలో 206/4 స్కోరు చేసింది. సెదిఖుల్లా అటల్ (83), జుబేద్‌‌ అక్బారీ (64), కరీమ్‌‌ జనత్‌‌ (41) దంచికొట్టారు. రసిఖ్ సలామ్‌‌ 3 వికెట్లు తీశాడు. 

తర్వాత ఇండియా 20 ఓవర్లలో 186/7 స్కోరుకే పరిమితమైంది. నిశాంత్‌‌ సింధు (23), నేహల్‌‌ వాధెరా (20), ప్రభుసిమ్రన్‌‌ సింగ్‌‌ (19) ఫర్వాలేదనిపించారు.  అటల్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’  అవార్డు లభించింది. అంతకుముందు జరిగిన తొలి సెమీస్‌‌లో శ్రీలంక–ఎ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌‌ను ఓడించి టైటిల్‌‌ ఫైట్‌‌కు అర్హత సాధించింది. పాక్‌‌ 20 ఓవర్లలో 135/9 స్కోరు చేయగా.. లంక 16.3 ఓవర్లలో 137/3 స్కోరు చేసి నెగ్గింది. ఆదివారం జరిగే ఫైనల్లో అఫ్గాన్‌‌.. లంకతో తలపడుతుంది.