తిలక్‌‌‌‌ అదరహో.. మూడో టీ20లో ఇండియా గెలుపు

  • రాణించిన అభిషేక్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌
  • యాన్సెన్‌‌‌‌, క్లాసెన్‌‌‌‌ పోరాటం వృథా

సెంచూరియన్‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌తో తిలక్‌‌‌‌ వర్మ (56 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌‌‌‌లతో 107 నాటౌట్‌‌‌‌), అభిషేక్‌‌‌‌ శర్మ (25 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 50) మెరుపులకు తోడు అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ (3/37) రన్స్‌‌‌‌ కట్టడి చేయడంతో.. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఇండియా 11 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది. దీంతో నాలుగు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 2–1 ఆధిక్యంలో నిలిచింది. 

టాస్‌‌‌‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 219/6  స్కోరు చేసింది. తర్వాత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 208/7  స్కోరు చేసింది. యాన్సెన్‌‌‌‌ (17 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 54), క్లాసెన్‌‌‌‌ (41) చివరి వరకు పోరాడారు. తిలక్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన నాలుగో టీ20 శుక్రవారం జొహనెస్‌‌‌‌బర్గ్‌‌‌‌లో జరుగుతుంది. 

ఇద్దరే దంచిన్రు..

ఇన్నింగ్స్‌‌‌‌ రెండో బాల్‌‌‌‌కు సంజూ శాంసన్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేసి సఫారీ బౌలర్లు భయపెట్టినా.. తిలక్‌‌‌‌, అభిషేక్​ దుమ్మురేపారు. యాన్సెన్‌‌‌‌ (1/28) వేసిన ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌ శాంసన్‌‌‌‌ హాఫ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు తాకడంతో సున్నా రన్స్‌‌‌‌కే తొలి వికెట్‌‌‌‌ కోల్పోయింది. ఈ దశలో అభిషేక్‌‌‌‌తో జత కట్టిన తిలక్‌‌‌‌ 4, 6తో ఖాతా ఓపెన్‌‌‌‌ చేశాడు. మూడో ఓవర్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ 4, 6, 4తో జోరు పెంచాడు. తర్వాత తిలక్‌‌‌‌ రెండు ఫోర్లు బాదితే, అభిషేక్‌‌‌‌ మూడు సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో పవర్‌‌‌‌ప్లేలో ఇండియా 70/1 స్కోరు చేసింది. 7వ ఓవర్‌‌‌‌లో 4 కొట్టిన అభిషేక్‌‌‌‌ 9వ ఓవర్‌‌‌‌లో భారీ సిక్స్‌‌‌‌తో 24  బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ ఇదే ఓవర్‌‌‌‌లో కేశవ్‌‌‌‌ (2/36) బాల్‌‌‌‌ను ముందుకొచ్చి ఆడే క్రమంలో స్టంపౌటయ్యాడు. ఫలితంగా రెండో వికెట్‌‌‌‌కు 107 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. 

తర్వాతి ఓవర్‌‌‌‌లో సూర్య (1) కూడా వెనుదిరగడంతో ఇండియా 110/3తో నిలిచింది. హార్దిక్‌‌‌‌ పాండ్యా (18) మూడు ఫోర్లతో టచ్‌‌‌‌లోకి వచ్చినా కేశవ్‌‌‌‌ స్పిన్‌‌‌‌ ముందు నిలవలేదు. 32 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన తిలక్‌‌‌‌ ఆ తర్వాత మరింత జోరు పెంచాడు. 15వ ఓవర్‌‌‌‌లో 4, 6, 4, తర్వాతి ఓవర్‌‌‌‌లో 6, 6, 4 దంచాడు. సింగిల్స్‌‌‌‌కు పరిమితమైన రింకూ సింగ్‌‌‌‌ (8) సరైన ఫినిషింగ్ ఇవ్వలేదు. 18వ ఓవర్‌‌‌‌లో సిమిలెన్‌‌‌‌ (2/34) బౌలింగ్‌‌‌‌లో ఔటయ్యాడు. రమన్‌‌‌‌దీప్‌‌‌‌ (15) ఫోర్‌‌‌‌తో ఖాతా తెరవగా, తిలక్‌‌‌‌ 4, 6తో 51 బాల్స్‌‌‌‌లో తొలి సెంచరీ పూర్తి చేశాడు. దీంతో స్కోరు 200లు దాటింది. 

యాన్సెన్‌‌‌‌, క్లాసెన్‌‌‌‌ జోరు..

టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో సౌతాఫ్రికాకు మెరుగైన ఆరంభం దక్కకపోయినా మధ్యలో యాన్సెన్‌‌‌‌, క్లాసెన్‌‌‌‌ చెలరేగారు. అయినా ఇండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి రన్స్‌‌‌‌ కట్టడి చేశారు. మూడో ఓవర్‌‌‌‌లోనే అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌.. రికెల్టన్‌‌‌‌ (20)ను ఔట్‌‌‌‌ చేయగా, ఆరో ఓవర్‌‌‌‌లో వరుణ్‌‌‌‌ (2/54).. హెండ్రిక్స్‌‌‌‌ (21)ను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. పవర్‌‌‌‌ప్లేలో 55/2 స్కోరు చేసిన ప్రొటీస్‌‌‌‌కు 9వ ఓవర్‌‌‌‌లో మరో దెబ్బ పడింది. స్టబ్స్‌‌‌‌ (12)ను అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (1/29) క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేశాడు. పదో ఓవర్‌‌‌‌లో మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (29)ను ఔట్‌‌‌‌ చేయడంతో 84/4తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో క్లాసెన్, మిల్లర్‌‌‌‌ (18) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. 

సిక్స్‌‌‌‌తో కుదురుకున్న క్లాసెన్‌‌‌‌.. 14వ ఓవర్‌‌‌‌లో 6, 6, 6, 4తో 23 రన్స్‌‌‌‌ దంచాడు. ఓవరాల్‌‌‌‌గా 15 ఓవర్లలో స్కోరు 134/4తో నిలిచింది. ఇక చివరి 30 బాల్స్‌‌‌‌లో 86 రన్స్‌‌‌‌ కావాల్సిన దశలో మిల్లర్‌‌‌‌ సిక్స్‌‌‌‌తో భయపెట్టినా, నాలుగో బాల్‌‌‌‌కు బౌండ్రీ వద్ద అక్షర్‌‌‌‌ సూపర్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ అందుకున్నాడు. ఐదో వికెట్‌‌‌‌కు 58 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. 17వ ఓవర్‌‌‌‌లో యాన్సెస్‌‌‌‌ రెండు సిక్స్‌‌‌‌లు, తర్వాత ఫోర్‌‌‌‌ బాదితే క్లాసెన్‌‌‌‌ షాట్‌‌‌‌కు యత్నించి వెనుదిరిగాడు. చివరి రెండు ఓవర్లలో 51 రన్స్‌‌‌‌ అవసరం కాగా యాన్సెన్‌‌‌‌ 4, 6, 4, 2, 6, 4తో 26 రన్స్‌‌‌‌ కొట్టాడు. మిగతా 25 రన్స్‌‌‌‌కుగాను యాన్సెస్‌‌‌‌ 6 కొట్టి ఔటయ్యాడు. చివరి మూడు బాల్స్‌‌‌‌లో 18 రన్స్‌‌‌‌ కొట్టలేక సఫారీలు ఓటమిపాలయ్యారు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 219/6 (తిలక్‌‌‌‌ 107*, అభిషేక్‌‌‌‌ 50, సిమిలెన్‌‌‌‌ 2/34). 
సౌతాఫ్రికా: 20 ఓవర్లలో 208/7 (యాన్సెన్‌‌‌‌ 54, క్లాసెన్‌‌‌‌ 41, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ 3/37).