వరుణ్‌‌ వణికించినా..రెండో టీ20లో ఇండియాకు తప్పని ఓటమి

  • 3 వికెట్లతో సౌతాఫ్రికా విక్టరీ
  • గెలిపించిన స్టబ్స్‌‌, కొయెట్జీ

గెబెహా : బ్యాటర్లు విఫలమైన పిచ్‌‌పై స్పిన్నర్‌‌ వరుణ్‌‌ చక్రవర్తి (5/17) ఐదు వికెట్లతో తడాఖా చూపెట్టినా.. చివర్లో మన పేసర్లు ఘోరంగా తేలిపోయారు. 24 బాల్స్‌‌లో 37 రన్స్‌‌ కావాల్సిన దశలో ట్రిస్టాన్‌ స్టబ్స్‌‌ (41 బాల్స్‌‌లో 7 ఫోర్లతో 47 నాటౌట్‌‌), గెరాల్ట్ కొయెట్జీ (9 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 19 నాటౌట్‌‌)ను కట్టడి చేయలేక చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌‌ను సౌతాఫ్రికాకు అప్పగించారు. దీంతో ఆదివారం జరిగిన రెండో టీ20లో ప్రొటీస్‌‌ 3 వికెట్ల తేడాతో ఇండియాపై నెగ్గింది. నాలుగు మ్యాచ్‌‌ల సిరీస్‌ను  1–1తో సమం  చేసింది.

టాస్‌‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 124/6 స్కోరు చేసింది. హార్దిక్ పాండ్యా (45 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 39), అక్షర్‌‌ పటేల్‌‌(21 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 27), తిలక్‌‌ వర్మ (20 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 1 సిక్స్‌‌తో 20) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. తర్వాత సౌతాఫ్రికా 19 ఓవర్లలో 128/7 స్కోరు చేసి నెగ్గింది. హెండ్రిక్స్‌‌ (24) ఫర్వాలేదనిపించాడు. స్టబ్స్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 సెంచూరియన్‌‌లో బుధవారం జరుగుతుంది. 

‘టాప్‌‌’ ఫెయిల్‌‌..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా టాపార్డర్‌‌.. సఫారీ బౌలింగ్‌‌ ముందు తేలిపోయింది. ఇన్నింగ్స్‌‌ మూడో బాల్‌‌కే సంజూ శాంసన్‌‌ (0) డకౌటయ్యాడు. యాన్సెన్‌‌ (1/19) వేసిన గుడ్‌‌ లెంగ్త్‌‌ స్ట్రయిట్‌‌ బాల్‌‌ను భారీ షాట్‌‌గా మలిచే క్రమంలో సంజూ క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. రెండో ఓవర్‌‌లో కొయెట్జీ (1/25) వేసిన షార్ట్‌‌ బాల్‌‌కు అభిషేక్‌‌ శర్మ (4) వెనక్కి వచ్చేశాడు. నాలుగో ఓవర్‌‌లో సిమిలెన్‌‌ (1/20) యార్కర్‌‌కు కెప్టెన్‌‌ సూర్య (4) వికెట్ల ముందు దొరికాడు. దీంతో15/3తో పీకల్లోతు కష్టాల్లో పడిన ఇండియాను తిలక్‌‌, అక్షర్‌‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్‌‌ప్లేలో ఇండియా 34/3 స్కోరు చేసింది.

కానీ 8వ ఓవర్‌‌లో మార్‌‌క్రమ్‌‌ (1/4) బాల్‌‌ను డ్రైవ్‌‌ చేసిన తిలక్‌‌ ఎక్స్‌‌ట్రా కవర్స్‌‌లో మిల్లర్‌‌ చేతికి చిక్కాడు. నాలుగో వికెట్‌‌కు 30 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఈ దశలో హార్దిక్‌‌ నిలకడ చూపెట్టినా రెండో ఎండ్‌‌లో వికెట్ల పతనం ఆగలేదు. 12వ ఓవర్‌‌లో అక్షర్‌‌ రనౌట్‌‌ కావడంతో ఐదో వికెట్‌‌కు 25 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. 70 రన్స్‌‌కే సగం జట్టు పెవిలియన్‌‌కు చేరడంతో ఆశలన్నీ రింకూ సింగ్‌‌ (9)పై పెట్టుకున్నారు.

కానీ తన శైలికి భిన్నంగా ఆడిన రింకూను 16వ ఓవర్‌‌లో పీటర్‌‌ (1/20) పెవిలియన్‌‌కు పంపడంతో అర్ష్‌‌దీప్‌‌ (7 నాటౌట్‌‌) క్రీజులోకి వచ్చాడు. తర్వాత హార్దిక్‌‌ మూడు ఫోర్లు, ఓ సిక్స్‌‌ కొట్టినా, చివరి రెండు ఓవర్లలో 9 రన్సే వచ్చాయి. చివరి 10 ఓవర్లలో 62 రన్స్‌‌ రావడంతో ఇండియా ఆ మాత్రం స్కోరు చేసింది. 

ఆఖర్లో అద్భుతం..

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో సౌతాఫ్రికా లైనప్‌‌ను ఇండియా బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టినా ఆఖర్లో స్టబ్స్‌‌, కొయెట్జీ అద్భుతంగా ఆడారు. మూడో ఓవర్‌‌లో రికెల్టన్‌‌ (13)ను ఔట్‌‌ చేసి అర్ష్‌‌దీప్‌‌ (1/41) ఇచ్చిన ఆరంభాన్ని వరుణ్‌‌ కొనసాగించాడు.  తన నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి ప్రొటీస్‌‌ స్కోరు బోర్డును కట్టడి చేశాడు. హెండ్రిక్స్‌‌,  స్టబ్స్‌‌ నిలకడగా ఆడినా అవతలి వైపు వరుణ్‌‌ దెబ్బకు మిగతా వారు పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. మార్‌‌క్రమ్‌‌ (3), యాన్సెన్‌‌ (7), క్లాసెన్‌‌ (2), మిల్లర్‌‌ (0) నిరాశపర్చడంతో సౌతాఫ్రికా 66 రన్స్‌‌కే 6 వికెట్లు కోల్పోయింది.

16వ ఓవర్‌‌లో రవి బిష్ణోయ్‌‌ (1/21) దెబ్బకు సిమిలెన్‌‌ (7) వెనుదిరగడంతో 88/7 స్కోరుతో సఫారీల కష్టాలు రెట్టింపయ్యాయి. ఇక 24 బాల్స్‌‌లో 37 రన్స్‌‌ చేయాల్సిన దశలో అర్ష్‌‌దీప్‌‌, హార్దిక్‌‌ మ్యాచ్‌‌ను సఫారీల చేతుల్లో పెట్టారు. ఈ ఇద్దరి బౌలింగ్‌‌లో కొయెట్జీ,   స్టబ్స్‌‌ భారీ షాట్లతో చెలరేగి మరో ఓవర్  మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా : 20 ఓవర్లలో 124/6 (హార్దిక్‌‌ 39, అక్షర్‌‌ 27, మార్‌‌క్రమ్‌‌ 1/4, యాన్సెన్‌‌ 1/25).

సౌతాఫ్రికా : 19 ఓవర్లలో 128/7 (స్టబ్స్‌‌ 47*, హెండ్రిక్స్‌‌ 24, వరుణ్‌‌ 5/17).