IND vs NZ 3rd Test: ముగిసిన రెండో రోజు ఆట.. పట్టు బిగించిన టీమిండియా

ముంబై టెస్టులో ఫలితం మూడు రోజుల్లోనే తేలిపోనుంది. రెండోరోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ప్రస్తుతం కివీస్ 143 పరుగుల లీడ్‌లో ఉంది. ఒక్క వికెట్ మాత్రమే మిగిలివుంది. సమయం ముగియడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అజాజ్ పటేల్(7*), విలియం ఒర్కే(0*) క్రీజులో ఉన్నారు.

తొలి రెండు టెస్టుల్లో అద్భుతమైన ఆట తీరు కనపరిచిన న్యూజిలాండ్‌ బ్యాటర్లు ఆఖరి టెస్టులో చతికిలపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే కుప్పకూలగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే ఆట తీరు కనపరిచారు. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుండటంతో భారత స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్ చెలరేగిపోయారు. వైవిధ్యమైన బంతులతో కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(51) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు.

అంతకుముందు రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. దాంతో, 28 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ల‌భించింది. కివీస్ స్పిన్నర్ అజాజ్ ప‌టేల్ త‌న స్పిన్‌ మాయాజాలంతో భార‌త బ్యాట‌ర్ల‌కు చెమటలు పట్టించాడు. 5 వికెట్లు పడగొట్టి రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన రోహిత్ సేన.. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. అందునా, ఈ టెస్టులో విజయం సాధిస్తే, వైట్‌వాష్‌ నుంచి తప్పించుకోవచ్చు.