IND vs NZ 2nd Test: పూణే టెస్టులో టీమిండియా ఓటమి.. సిరీస్ న్యూజిలాండ్ వశం

భారత గడ్డపై టీమిండియాతో సిరీస్ అంటే, ఎంతటి ప్రత్యర్థి అయినా ఆశలు వదులుకోవాల్సిందే. అచ్చోచ్చిన ఉపఖండ పిచ్‌లపై భారత స్పిన్నర్లు తమ స్పిన్‌ అస్త్రంతో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టించేవారు. కానీ, ఈసారి పరిస్థితి మారింది. సీన్ రివర్స్ అయ్యింది. సొంతగడ్డపై భారత టెస్ట్ సిరీస్ జైత్రయాత్రకు న్యూజిలాండ్ అడ్డుకట్ట వేసింది. బెంగుళూరు వేదికపై తొలి టెస్టులో సంచలన విజయాన్ని అందుకున్న కివీస్.. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఫలితంగా, మరో మ్యాచ్ మిగిలివుండగానే టెస్ట్ సిరీస్ వశం చేసుకుంది. 2012 నుండి స్వదేశంలో ఓటమి ఎరగని జట్టుగా కొనసాగుతున్న రోహిత్ సేనకు ఈ పరాజయం భారీ దెబ్బ.

చేజేతులా చేజారే.. 

రెండో టెస్టులో భారత్ విజయానికి యశస్వి జైస్వాల్ (77) మార్గం చూపినప్పటికీ, ఇతర బ్యాటర్లు దానిని కొనసాగించలేకపోయారు. బాధ్యతారాహిత్యంగా ఆడుతూ జట్టు ఓటమికి కారణమయ్యారు. జూనియర్ల సంగతి పక్కనపెడితే.. సీనియర్లే జట్టుకు అధిక భారంగా మారుతున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రెండెంకెల మార్క్ చేరుకోవడానికే నానా అవస్థలు పడుతున్నారు. 

ALSO READ | Yashasvi Jaiswal: ఎలైట్ లిస్టులో జైశ్వాల్.. మూడో భారత క్రికెటర్‌

కివీస్ నిర్ధేశించిన 359 పరుగుల భారీ ఛేదనలో టీమిండియా 245 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ (8), శుభ్ మన్ గిల్(23), రిషబ్ పంత్(0), విరాట్ కోహ్లీ(17), సర్ఫరాజ్ ఖాన్(9), వాషింగ్టన్ సుందర్(21).. ఇలా ఏ ఒక్కరూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేయలేదు. దాంతో, టీమిండియాకు ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టి భారత్ నడ్డి విరిచిన మిచెల్ సాంట్నర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 6 వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 259 పరుగులు చేయగా.. భారత్ 155 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ జట్టు 255 పరుగులు చేసింది.

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్: 259 ఆలౌట్ (కాన్వే- 76, రవీంద్ర- 65)
భారత్ తొలి ఇన్నింగ్స్: 156 ఆలౌట్
న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్: 255 ఆలౌట్(టామ్ లథమ్- 88)
భారత్ రెండో ఇన్నింగ్స్: 225 ఆలౌట్ (జైశ్వాల్ - 77)