IND vs NZ: తొలి ఇన్నింగ్స్‌ మా కొంప ముంచింది: రోహిత్ శర్మ

న్యూజిలాండ్‌పై తొలి టెస్టు ఓటమికి తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరు చేయడమే కారణమని భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. పిచ్‌‌పై ఉన్న తేమను కివీస్ పేసర్లు బాగా ఉపగించుకున్నారని తెలిపిన భారత కెప్టెన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో రిషభ్‌-సర్ఫరాజ్‌ అద్భుత పోరాటంతో తమకు కనీసం పోరాడే అవకాశమైనా దొరికిందని పేర్కొన్నాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన హిట్‌మ్యాన్ పలు అంశాలను ప్రస్తావించాడు.

"సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచిగా బ్యాటింగ్‌ చేశాం. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమై, 350 వెనుకబడి ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచించకూడదు. అంత లీడ్‌ను కరిగించాలంటే.. నిలకడగా బ్యాటింగ్‌ చేయడం ఒక్కటే మార్గం. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి భాగస్వామ్యాలు లభించాయి. ముఖ్యంగా రిషభ్‌-సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు.. సరైన లక్ష్యాన్ని చేరుకుంటాం అనిపించింది. పంత్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తే.. సర్ఫరాజ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో మ్యాచ్ లోనే ఇలా ఆడటం మంచి విషయం.." 

Also Read :- న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి

"ఇక చెప్పాల్సింది.. తొలి ఇన్నింగ్స్. మొదటి  ఇన్నింగ్స్‌ సమయంలో పిచ్‌ తేమగా ఉంటుందని అంచనా వేశాం.. మరీ 46 పరుగులను ఊహించ లేదు. న్యూజిలాండ్‌ బౌలర్లు బాగా బౌలింగ్‌ చేశారు. మేము వారిని ఎదుర్కోవడంలో విఫలమయ్యాం. అందుకే ఇలాంటి ఫలితం వచ్చింది. ఈ ఓటమి నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నాం. మరింత బాధ్యతగా ముందుకెళ్తాం.." అని రోహిత్ మాట్లాడారు.

ఇంగ్లండ్‌ చేతిలో ఇలానే ఓడాం..

గతంలో ఇంగ్లాండ్‌ చేతిలో ఇలానే ఓ మ్యాచ్‌ ఓడి.. ఆ తరువాత సిరీస్ చేజిక్కించుకున్న విషయాన్ని రోహిత్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి.. సిరీస్ వశం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, అందుకు జట్టులోని ప్రతి ఒక్కరిలో గెలవాలనే స్ఫూర్తి అవసరమని పేర్కొన్నాడు.

ఈ ఇరు జట్ల మధ్య అక్టోబర్ 24 నుంచి పూణె వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.