IND vs BAN 2nd Test: కాన్పూర్‌ టెస్టులో టీ20 ఆట

  • దంచికొట్టిన జైస్వాల్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ, రోహిత్
  • తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 34.4 ఓవర్లలోనే 285/9 డిక్లేర్డ్‌‌‌‌‌‌‌‌
  • ఫాస్టెస్ట్ 50, 100, 150, 200, 250 స్కోర్లతో రికార్డు
  • తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 233 ఆలౌట్‌‌‌‌‌‌‌‌.. రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 26/2
  • కాన్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టుపై ఆశలు రేపిన రోహిత్‌‌‌‌‌‌‌‌సేన

కాన్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: టెస్టు క్రికెట్‌‌‌‌లో టీమిండియా టీ20 ఆట చూపెట్టింది. ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో బజ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌ను మించేలా.. బాల్‌‌‌‌‌‌‌‌ బద్దలయ్యేలా చెలరేగింది. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఉతికేస్తూ  టెస్టులో వేగంగా  50, 100, 150, 200, 250  టీమ్ స్కోర్లతో రికార్డు సృష్టించింది. ఈ దెబ్బకు రెండున్నర రోజుల ఆట పూర్తిగా రద్దవడంతో డ్రా అనుకున్న రెండో టెస్టులో విజయంపై ఆశలు రేపింది. నాలుగో రోజు, సోమవారం అటు బౌలింగ్‌‌‌‌‌‌‌‌, ఇటు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌సేన అదరగొట్టింది. మొమినుల్‌‌‌‌‌‌‌‌ హక్ (107 నాటౌట్‌‌‌‌‌‌‌‌) సెంచరీతో మెరిసినా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ను 233 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌట్‌‌‌‌‌‌‌‌ చేసిన ఇండియా తర్వాత బ్యాట్‌‌‌‌‌‌‌‌తో రఫ్పాడించింది. యశస్వి జైస్వాల్ (51 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 72), కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్ (43 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) ఫిఫ్టీలకు తోడు మిగతా బ్యాటర్లూ విజృంభించడంతో  తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను ఇండియా 34.4 ఓవర్లలోనే 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.  దాంతో 52 రన్స్ ఆధిక్యం దక్కించుకుంది. విరాట్ కోహ్లీ (35 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 47), శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్ (36 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4  ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 39),  కెప్టెన్ రోహిత్ శర్మ (11 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 3 సిక్సర్లతో 23) కూడా ఆకట్టుకున్నారు.  బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్‌‌‌‌‌‌‌‌, షకీబ్ అల్ హసన్‌‌‌‌‌‌‌‌ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన బంగ్లా 26/2 స్కోరుతో నాలుగో రోజు ముగించింది. జాకిర్ హసన్ (10), హసన్ మహ్ముద్‌‌‌‌‌‌‌‌ (4)ను అశ్విన్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ చేయగా.. షాడ్మన్ ఇస్లాం (7 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), మోమినుల్ హక్‌‌‌‌‌‌‌‌ (0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు.  మరొక్క రోజు ఆట మిగిలున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా  ఇంకా 26 రన్స్‌‌‌‌‌‌‌‌ వెనుకంజలోనే ఉంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో  రెండో ఇన్నింగ్స్‌‌లో ఆ జట్టును 150 స్కోరులోపు ఆలౌట్‌‌‌‌‌‌‌‌ చేస్తే  రోహిత్‌‌‌‌‌‌‌‌సేన గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. 

అటు మోమినుల్‌‌‌‌‌‌‌‌... ఇటు బౌలర్లు

వరుసగా ఎనిమిది సెషన్ల ఆట రద్దయిన తర్వాత సోమవారం ఉదయం నుంచి మంచి ఎండ రావడంతో ఎట్టకేలకు మ్యాచ్ తిరిగి మొదలైంది. బంగ్లా టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోమినుల్ హక్ టెస్టుల్లో 13 సెంచరీ కొట్టినా  మిగతా బ్యాటర్ల నుంచి అతనికి సపోర్ట్ కరువైంది. దాంతో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 107/3తో ఆట కొనసాగించిన బంగ్లా ఆరో ఓవర్లోనే ముష్ఫికర్ రహీమ్ (11) వికెట్‌‌‌‌‌‌‌‌ కోల్పోయింది. స్టార్ పేసర్ బుమ్రా (3/50) యాంగిల్ డెలివరీతో అతడిని బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. కొద్దిసేపటికే  సిరాజ్‌‌‌‌‌‌‌‌ (2/57) బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో  మిడాఫ్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌ సింగిల్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్‌‌‌‌‌‌‌‌తో పట్టిన స్టన్నింగ్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌కు  లిటన్ దాస్ (13) పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేరాడు.  ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ షకీబ్ హసన్ (9) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. అశ్విన్‌‌‌‌‌‌‌‌ (2/47)బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌ పట్టిన చురుకైన క్యాచ్ కు  ఔటయ్యాడు. ఓ ఎండ్‌‌లో ఒంటరి పోరాటం చేస్తున్న మోమినుల్‌‌‌‌‌‌‌‌కు కాసేపు సహకారం అందించిన మెహిదీ హసన్ (20)తో పాటు తైజుల్ ఇస్లాం (5)ను  బుమ్రా వెనక్కుపంపగా..  సిరాజ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో హసన్ మహ్ముద్‌‌‌‌‌‌‌‌ (1) ఎల్బీగా ఔటయ్యాడు. ఖాలెద్ అహ్మద్‌‌‌‌‌‌‌‌ (0) రిటర్న్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌తో ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన జడేజా బంగ్లాను ఆలౌట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

ధనాధన్‌‌‌‌‌‌‌‌.. ఫటాఫట్‌‌‌‌‌‌‌‌

బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేసి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇండియాకు  ఓపెనర్లు జైస్వాల్‌‌‌‌‌‌‌‌, రోహిత్‌‌‌‌‌‌‌‌ మెరుపు ఆరంభం ఇచ్చారు. తొలి ఓవర్లోనే జైస్వాల్‌‌‌‌‌‌‌‌ మూడు ఫోర్లు కొట్టగా.. రోహిత్‌‌‌‌‌‌‌‌ ఎదుర్కొన్న తొలి రెండు బాల్స్‌‌‌‌‌‌‌‌ను సిక్సర్లుగా మలిచి ఔరా అనిపించాడు. వీలైనంత త్వరగా బంగ్లా స్కోరును దాటేయాలన్న ఉద్దేశంతో ఆడిన ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చిన బాల్‌‌‌‌‌‌‌‌ను వచ్చినట్టు బౌండ్రీకి పంపే ప్రయత్నం చేశారు. ఫలితంగా మూడు ఓవర్లలోనే స్కోరు ఫిఫ్టీ దాటింది. పేసర్లు చేతులెత్తేయడంతో బంగ్లా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శాంటో.. స్పిన్నర్ మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దింపగా.. అతను రోహిత్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి బ్రేక్ ఇచ్చాడు. కానీ, మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో జోరు కొనసాగించిన  జైస్వాల్‌‌‌‌‌‌‌‌ చూస్తుండగానే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్‌‌‌‌‌‌‌‌ డౌన్ బ్యాటర్ గిల్‌‌‌‌‌‌‌‌తో కలిసి రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 72 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి 10.1 ఓవర్లలోనే స్కోరు వంద దాటించాడు.

వేగంగా ఆడే ప్రయత్నంలో ఈ ఇద్దరూ ఔటవగా.. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముందుకొచ్చిన కీపర్ రిషబ్ పంత్ (9) ఫెయిలయ్యాడు. అయితే, ఇండియా జోరు కొనసాగించే బాధ్యతను  విరాట్ కోహ్లీ, కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు. ఇద్దరూ ధాటిగా ఆడి ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 87 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించారు. ఫిఫ్టీ ముంగిట కోహ్లీని షకీబ్ ఔట్‌‌‌‌‌‌‌‌ చేయగా.. రాహుల్‌‌‌‌‌‌‌‌ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. జడేజా (8), అశ్విన్ (1) నిరాశపరచగా.. 33 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రాహుల్‌‌‌‌‌‌‌‌  మెహిదీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో స్టంపౌటయ్యాడు. కాసేపటికే ఆకాశ్ దీప్ (12) తొమ్మిదో వికెట్‌‌‌‌‌‌‌‌గా పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేరడంతో కెప్టెన్ రోహిత్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను డిక్లేర్ చేశాడు. 

రికార్డులే రికార్డులు

బ్యాటర్లు టీ20 పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే మాదిరి ఆటతోవిజృంభించడంతో టెస్టుల్లో  టీమిండియా పలు కొత్త రికార్డులు సృష్టించింది.  

  • 3 ఓవర్లలోనే  ఫిఫ్టీ స్కోరు చేసిన ఇండియా.. ఈ ఏడాది వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌పై ఇంగ్లండ్  4.2 ఓవర్లలో చేసిన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసింది.  
  • టెస్టుల్లో అత్యంత వేగంగా 10.1 ఓవర్లలోనే 100 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. గతేడాది వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌పై 12.2 ఓవర్లలో తమ పేరిటే ఉన్న రికార్డును మెరుగు పరుచుకుంది.
  • 24.2 ఓవర్లలోనే ఫాస్టెస్‌‌‌‌‌‌‌‌  200 స్కోరు చేసిన ఇండియా 2017లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై ఆస్ట్రేలియా 28.1  ఓవర్లలో నెలకొల్పిన ఈ రికార్డును బద్దలు కొట్టింది.  
  • ఫాస్టెస్ట్ టీమ్‌‌‌‌‌‌‌‌ 150 (18.2 ఓవర్లు), 250 (30.1 ఓవర్లు) స్కోర్లు కూడా ఇండియా ఖాతాలోనే చేరాయి. గతేడాది వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌పై ఇండియానే 21.1 ఓవర్లలో 150 రన్స్‌‌‌‌‌‌‌‌,  ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ 2022లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై 34 ఓవర్లలో వేగంగా  250 స్కోర్లు చేశాయి.
  • ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ఏ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో అయినా  ఇండియా 20 బంతుల్లోనే ఫిఫ్టీ స్కోరు చేయడం ఇదే  తొలిసారి.   
  • ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 8.22 రన్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌ నమోదు చేసింది. కనీసం 200 బాల్స్‌‌‌‌‌‌‌‌ ఆడిన టెస్టు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో  ఇదే అత్యధిక రన్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌. 
  • సంక్షిప్త స్కోర్లు
  • బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 74.2 ఓవర్లలో 233 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (మోమినుల్ హక్ 107 నాటౌట్‌‌‌‌‌‌‌‌, బుమ్రా 3/50); ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 34.4 ఓవర్లలో 285/9 డిక్లేర్డ్‌‌‌‌‌‌‌‌ (జైస్వాల్‌‌‌‌‌‌‌‌ 72, రాహుల్ 68, మిరాజ్‌‌‌‌‌‌‌‌ 4/41, షకీబ్ 4/78); బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 11 ఓవర్లలో 26/2 (షాడ్మన్‌‌‌‌‌‌‌‌ 7 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, మోమినుల్ 0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, అశ్విన్‌‌‌‌‌‌‌‌ 2/14).
  • జడేజా @ 300
  • రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్‌‌‌‌‌‌‌‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన  ఏడో ఇండియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. 
  • కోహ్లీ @ 27,000
  • విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 27 వేల రన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. సచిన్ (34, 357) ,  సంగక్కర (28, 106), రికీ పాంటింగ్ (27, 483) టాప్‌‌‌‌–3లో ఉన్నారు.