ఇండియా క్లీన్‌‌స్వీప్‌‌.. 2-0తో బంగ్లాదేశ్‌‌పై సిరీస్‌‌ సొంతం

  • రెండో టెస్ట్‌‌లోనూ 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
  • రాణించిన జైస్వాల్‌‌, కోహ్లీ
  • బుమ్రా, అశ్విన్‌‌, జడేజాకు తలా మూడు వికెట్లు

కాన్పూర్‌‌: బంగ్లాదేశ్‌‌తో జరిగిన రెండో టెస్ట్‌‌లో టీమిండియా అద్భుతం చేసింది. వర్షం వల్ల రెండు రోజుల ఆట కోల్పోయినా.. బౌలర్ల సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌తో డ్రా దిశగా సాగిన మ్యాచ్‌‌లో ఊహించని విజయం సాధించింది. దీంతో మంగళవారం ముగిసిన ఈ పోరులో ఇండియా 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌ను ఓడించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 2–0తో క్లీన్‌‌స్వీప్‌‌ చేసింది.

బంగ్లాదేశ్‌‌ నిర్దేశించిన 95 రన్స్‌‌ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఐదో రోజు బరిలోకి దిగిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌లో 17.2 ఓవర్లలో 98/3 స్కోరు చేసి గెలిచింది. రోహిత్‌‌ శర్మ (8), శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (6) ఫెయిలైనా, యశస్వి జైస్వాల్‌‌ (51), విరాట్‌‌ కోహ్లీ (29 నాటౌట్‌‌) మూడో వికెట్‌‌కు 58 రన్స్‌‌ జోడించి విజయానికి బాటలు వేశారు. చివర్లో రిషబ్‌‌ పంత్‌‌ (4 నాటౌట్‌‌) తన ట్రేడ్‌‌ మార్క్‌‌ ఫోర్‌‌తో గెలుపు అందించాడు. అంతకుముందు 26/2 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 47 ఓవర్లలో 146 రన్స్‌‌కే ఆలౌటైంది. షాద్మాన్‌‌ ఇస్లామ్‌‌ (50) మినహా మిగతా వారు విఫలయయ్యారు. జైస్వాల్‌‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, అశ్విన్‌‌ (11 వికెట్లు, 114 రన్స్‌‌)కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డులు లభించాయి. 

బౌలర్లు అదరహో..

26/2 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన బంగ్లాకు ఇండియా బౌలర్లు చుక్కలు చూపెట్టారు. కచ్చితంగా ఫలితాన్ని రాబట్టాలనే ఉద్దేశంతో ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. స్టార్టింగ్‌‌లోనే అశ్విన్‌‌ (3/50) ఓ ఫ్లయిట్‌‌ డెలివరీతో మోమినల్‌‌ హక్‌‌ (2) ఔట్‌‌ చేసి వికెట్ల పతనాన్ని మొదలుపెట్టాడు. తర్వాత జడేజా (3/34), బుమ్రా (3/17), ఆకాశ్‌‌ దీప్‌‌ (1/20) ముందుకు తీసుకెళ్లారు. అయితే ఓ ఎండ్‌‌లో షాద్మాన్‌‌ ఒంటరి పోరాటం చేశాడు. ఇండియా బౌలింగ్‌‌ను దీటుగా ఎదుర్కొంటూ వరుసపెట్టి బౌండ్రీలు బాదాడు. ఈ క్రమంలో కెప్టెన్‌‌ నజ్ముల్‌‌ శాంటో (2)తో కలిసి నాలుగో వికెట్‌‌కు 55 రన్స్‌‌ జోడించాడు. కానీ 28వ ఓవర్లో జడేజా బౌలింగ్‌‌లో రివర్స్‌‌ స్వీప్‌‌కు ట్రై చేసి శాంటో క్లీన్‌‌ బౌల్డ్‌‌ అయ్యాడు. తర్వాతి ఓవర్‌‌లో ఆకాశ్‌‌.. షాద్మాన్‌‌ను  ఔట్‌‌ చేయడంతో ఇన్నింగ్స్‌‌ పేకమేడలా కూలింది. బుమ్రా, జడేజా వరుస విరామాల్లో  లిటన్‌‌ దాస్‌‌ (1), షకీబ్‌‌ (0), మెహిదీ హసన్‌‌ (9), తైజుల్‌‌ ఇస్లామ్‌‌ (0) ఔట్‌‌ చేసి ఇండియా టార్గెట్‌‌ను వంద లోపే పరిమితం చేశారు.

మరో మూడు గెలిస్తే..

బంగ్లాపై క్లీన్‌‌స్వీప్‌‌తో టీమిండియా వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌‌కు మరింత చేరువైంది. ఈ సీజన్‌‌లో ఆడిన 11 మ్యాచ్‌‌ల్లో 8 గెలిచిన ఇండియా రెండింటిలో ఓడింది. ఒకటి డ్రా అయ్యింది. దీంతో రోహిత్‌‌సేన 98 పాయింట్లతో (74.42 పీసీటీ) టాప్‌‌ ప్లేస్‌‌ను సుస్థిరం చేసుకుంది. ఆస్ట్రేలియా 90 పాయింట్లతో(62.50 పీసీటీ) రెండో ప్లేస్‌‌లో కొనసాగుతుంది. రాబోయే సీజన్‌‌లో ఇండియా మరో 8 టెస్ట్‌‌లు ఆడనుంది. ఇందులో మూడు గెలిస్తే ఇతర జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్స్‌‌కు అర్హత సాధిస్తుంది. ఇండియా తర్వాతి సిరీస్‌‌ల్లో న్యూజిలాండ్‌‌తో మూడు, ఆసీస్‌‌తో ఐదు టెస్ట్‌‌లు ఆడనుంది.

  • ఇండియాలో ఒక్క సిరీస్‌‌ కూడా ఓడిపోకుండా 4,300 రోజుల పాటు గెలుస్తూనే ఉన్న ఏకైక జట్టు టీమిండియా. సౌతాఫ్రికా (1704 రోజులు), ఆస్ట్రేలియా (1348), ఇంగ్లండ్‌‌ (1200), జింబాబ్వే (589), శ్రీలంక (427) తర్వాతి ప్లేస్‌‌ల్లో ఉన్నాయి. 
  • అత్యధిక సార్లు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌ గెలిచిన క్రికెటర్‌‌గా మురళీధరన్‌‌ (11) వరల్డ్‌‌ రికార్డును అశ్విన్‌‌ (11) సమం చేశాడు. 
  • స్వదేశంలో ఇండియాకు ఇది వరుసగా 18వ సిరీస్‌‌ విజయం. 2012-13లో టీమిండియా చివరిసారి ఇంగ్లండ్‌‌ చేతిలో 1-2 తేడాతో సిరీస్‌‌ను చేజార్చుకుంది. 
  • 180.. 92 ఏళ్ల టెస్ట్‌‌ చరిత్రలో టీమిండియా సాధించిన విజయాల సంఖ్య. 581 మ్యాచ్‌‌లు ఆడగా, 178 మ్యాచ్‌‌ల్లో ఓడింది. 

సంక్షిప్త స్కోర్లు

  • బంగ్లాదేశ్‌‌ తొలి ఇన్నింగ్స్‌ ‌: 233 ఆలౌట్‌‌
  • ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌: 285/9 డిక్లేర్డ్‌‌
  • బంగ్లాదేశ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌ : 47 ఓవర్లలో 146 ఆలౌట్‌‌
  • ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌: 98/3