IND vs BAN 2nd Test: కుప్పకూలిన బంగ్లాదేశ్.. టీమిండియా టార్గెట్ 95

కాన్పూర్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులతో పర్వాలేదనిపించిన బంగ్లా బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చేతులెత్తేశారు. భారత బౌలర్లను ఎదుర్కోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. 146 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం లక్ష్యం 95 పరుగులు. 

తొలి మూడు రోజులు వర్షార్పణం

తొలి మూడు రోజులు వరుణుడు అడ్డుపడటంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలేది అసంభవమే అనిపించింది. అలాంటి చోట రోహిత్ సేన అద్భుతం చేసింది. వీలైనంత త్వరగా బంగ్లా ఇన్నింగ్స్‌ను ముగించిన భారత ఆటగాళ్లు.. కాన్పూర్ గడ్డపై మెరుపులు మెరిపించారు. 10 ఓవర్లలో 100.. 24 ఓవర్లలో 200.. 300 ఓవర్లలో 250 పరుగులు.. ఇలా బంగ్లా బౌలర్లను ఊచకోత కోశారు. చివరకు 285 పరుగులు వద్ద రోహిత్ సేన తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 

ALSO READ | ఐపీఎల్ ఆదాయం స్వాహా..!: బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌పై నెట్టింట ట్రోలింగ్

అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం(50) హాఫ్ సెంచరీ చేయగా.. ముష్ఫికర్ రహీమ్(37) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజా త్రయం మూడేసి వికెట్లు పడగొట్టారు. లంచ్ విరామం అనంతరం భారత రెండో ఇన్నింగ్స్ మొదలు కానుంది.

సిరీస్ క్లీన్ స్వీప్

2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్ 2-0 తేడాతో వశం కానుంది.