IND vs BAN: నితీష్, రింకూ హాఫ్ సెంచరీలు.. బంగ్లా టార్గెట్ 222

గ్వాలియర్‌లో దుమ్మురేపిన భారత బ్యాటర్లు.. ఢిల్లీ గడ్డపైనా అదే ఫామ్‌ను కొనసాగించారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి(34 బంతుల్లో 74) హాఫ్ సెంచరీ చేయగా.. రింకూ సింగ్(29 బంతుల్లో 53), హార్దిక్ పాండ్యా(19 బంతుల్లో 32) మెరుపులు మెరిపించారు.

ALSO READ | IND vs BAN: చితక్కొట్టిన తెలుగు కుర్రాడు.. భారీ స్కోర్ దిశగా టీమిండియా

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి మూడు ఓవర్లలోనే 2 కీలక వికెట్లు కోల్పోయింది. శాంసన్(10), అభిషేక్ శర్మ(15) ఇద్దరూ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి ఆరంభంలో కాస్త తడబడినట్లు కనిపించినా.. అనంతరం బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న నితీష్ రెడ్డి మొత్తంగా 74(34 బంతుల్లో; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు ) పరుగులు చేశాడు. అతనికి రింకూ సింగ్(53; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లు) కూడా తోడవ్వడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

ఆఖరి ఓవర్‌లో 3 వికెట్లు

నితీష్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హార్దిక్ అదే దూకుడు కొనసాగించాడు. 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అయితే ఆఖరి ఓవర్‌లో టీమిండియా 3 వికెట్లు కోల్పోవడం గమనార్హం. 20 ఓవర్ తొలి బంతికి పాండ్యా ఔటవ్వగా.. మూడో బంతికి వరుణ్ చక్రవర్తి, ఐదో బంతికి అర్షదీప్ పెవిలియన్ చేరారు. 

బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ 3, ముస్తాఫిజుర్ 2, తంజిమ్ హసన్ 2, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు.